ప్రేమించి, పెళ్లి చేసుకున్నభర్త తనను వదిలి వెళ్లిపోయాడని..ఓ భార్య.. కడుపున పుట్టిన బిడ్డల్ని రోడ్డు పాలు చేసిన ఉదంతమిది. ఆ ముగ్గురు పిల్లలు దిక్కు మొక్కు లేకుండా రోడ్డుపై ఏడుస్తుంటే.. గుర్తించిన ట్రాఫిక్ పోలీసు వారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన యాదగురి గుట్టలో జరగ్గా, ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తమ పట్ల తల్లి కనబర్చిన తీరు గురించి ఆ పిల్లలు చెబుతుంటే.. పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీని సైతం కన్నీరు పెట్టించింది.
యాదగిరి గుట్ట ఎస్ఐ సుధాకర్, ట్రాఫిక్ సిఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులది రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్, భగత్ సింగ్ కాలనీ. వీరి తల్లిదండ్రులదీ ప్రేమ వివాహం. ముగ్గురు పిల్లలు పుట్టాక.. వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. కొన్నాళ్లకు భర్త గొడవ పడి, వారిని వదిలేసి వెళ్లిపోయాడు. భర్త వదిలి వెళ్లిన కొన్ని రోజులకే ఆమెకు ఓ ఆటో డ్రైవర్ తో పరిచయం ఏర్పడి.. అది సహజీవనానికి దారితీసింది. వీరికి ఓ పాప పుట్టింది. అయితే మొదటి భర్తకు పుట్టిన బిడ్డలు.. వీరికి భారంగా నిలవడంతో ముగ్గురు కన్నబిడ్డల్ని ఓ రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయింది ఆ కసాయి తల్లి.
అయితే ముగ్గుర్ని రోడ్డుపై చూసిన పోలీసులు ..వీరి వివరాలు కనుక్కోని పెద్దనాన్నకు సమాచారం అందించారు. వారి పెద్దనాన్నవచ్చి.. తన తమ్ముడికి, అతడి భార్యకు విబేధాలు వచ్చి విడిపోయారని, తాము తీసుకెళ్లమని చెప్పి వెనుదిరిగారు. వీరిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరు పరచగా.. పిల్లలు చెప్పిన దాన్ని విని షాక్ అయ్యారు. ఈ నెల 14న తమ తల్లి, మరో వ్యక్తి తమను ఆటోలో యాదగిరి గుట్టకు తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు కట్టేసి, నోటిలో గుడ్డలు కుక్కి ఇక్కడ వదిలేసి వెళ్లిపోయారన్నారు. దానిలో పెద్ద బాలుడు కట్టు విడదీసుకుని, మిగిలిన చెల్లి, తమ్ముడికి కట్లు కూడా ఊడదీశానని చెప్పారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లలు శిశువిహార్లలో ఉంచారు.