అమ్మా.. నన్ను క్షమించు. పురుగుల మందు తాగాను. నేను బతకలేనేమో అమ్మా.. అంటూ కుమారుడు తల్లికి ఫోన్లో చెబుతున్న చివరి మాటలు ఇవి. అసలేం జరిగిందంటే? మంచిర్యాల జిల్లా రోటిగూడలో శ్రీకాంత్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బీటెక్ పూర్తి చేసిన శ్రీకాంత్ గత కొంత కాలం నుంచి పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నాడు. అయితే శ్రీకాంత్ ఇటీవల కొన్ని పోటీ పరీక్షలు రాశాడు. కాగా అతనికి ఇందులో తక్కువ మార్కులు వస్తున్నాయన్న కారణంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇక నాకు ఉద్యోగం రాదేమోనని కొన్ని రోజుల నుంచి దిగులుగా ఉంటున్నాడు. అన్ని ఆలోచించుకున్న శ్రీకాంత్ చనిపోవాలని అనుకున్నాడు.
ఇందులో భాగంగానే శనివారం రాత్రి 10 గంటలకు పురుగుల మందు తాగాడు. అనంతరం తన తల్లికి ఫోన్ చేసి.. అమ్మా, నన్ను క్షమించు.. పురుగుల మందు తాగాను. నేను ఇక బతకలేనేమో అంటూ చివరి సారిగా తల్లితో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అలెర్ట్ అయిన కుంటుంబ సభ్యులు వెంటనే శ్రీకాంత్ ను ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందిన శ్రీకాంత్ మంగళవారం తెల్లవారుజామున మరణించాడు. చేతికి అందిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.