అతనికి గతంలో ఓ యువతితో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి భార్యతో సంసారాన్నిసాగిస్తున్నాడు. అలా భార్యతో ఉంటూనే మరో అమ్మాయితో ప్రేమాయణం సాగించాడు. చివరికి కొంత కాలానికి భార్యకు తెలియకుండా ప్రియురాలిని గుడిలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఎట్టకేలకు తన మొదటి భార్యకు తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన భార్య భర్తతో గొడవకు దిగింది. దీంతో కొన్నాళ్ల తర్వాత ఇద్దరు భార్యలు మొగుడిని పట్టించుకోవడమే మానేశారు. భర్తకు ఏం చేయాలో అర్థం కాక సింపతి కోసం ఓ సరికొత్త మాస్టార్ ప్లాన్ వేసి చివరికి కటకటల పాలయ్యాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతం. ఇక్కడే సందీప్ గైక్వాడ్ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గతంలో సందీప్ గైక్వాడ్ ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకుని భార్యతో దాంపత్య జీవితాన్ని సంతోషంగానే గడిపాడు. ఇలా భార్యతో సంసారం చేస్తూనే సందీప్ గైక్వాడ్ ఈ మధ్యకాలంలో సునీత అనే యువతిని మొదటి భార్యకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయం కొన్ని రోజుల తర్వాత మొదటి భార్యకు తెలిసింది. దీంతో భర్తతో మొదటి భార్య గొడవకు దిగి ఆ తర్వాత అతనిని పట్టించుకోవడం మానేసింది. అలా కొంత కాలానికి రెండవ భార్య సునీత కూడా సందీప్ గైక్వాడ్ ను పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది.
దీంతో భర్త సందీప్ గైక్వాడ్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఏదైన చేసి తన ఇద్దరు భార్యలను తన దగ్గరకు చేర్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ ఇద్దరు భార్యలు సందీప్ గైక్వాడ్ ను మాత్రం పట్టించుకోలేదు. ఇక ఈ సమయంలోనే సందీప్ గైక్వాడ్ ఓ మాస్టర్ ప్లాన్ కు శ్రీకారం చుట్టాడు. అదే కిడ్నాప్ డ్రామా. తనను ఎవరో కిడ్నాప్ చేశారని తన ఇద్దరి భార్యలకు తెలిస్తే.. సింపతితో మళ్లీ నాతో సంతోషంగా ఉంటారని కిడ్నాప్ డ్రామా ప్లాన్ కు ముహుర్తం ఫిక్స్ చేశాడు. అయితే అక్టోబర్ 14న సందీప్ గైక్వాడ్ తన భార్య సునీతో కలిసి ఓ చోట స్కూటీ పార్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కొందరు యువకులు వచ్చి సందీప్ గైక్వాడ్ ను కొట్టి ఆటోలో తీసుకెళ్లారు.
ఇక వెంటనే రెండవ భార్య సునీత స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ గైక్వాడ్ తీసుకెళ్లిన ఆటో ఎక్కడుందో కనిపెట్టేందుకు రంగంలోకి దిగారు. ఇక రెండు రోజుల తర్వాత సందీప్ గైక్వాడ్ ను, అతనిని కిడ్నాప్ చేసిన కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. స్పందించిన ఆ యువకులు.. సందీప్ గైక్వాడ్ రెండవ భార్య సునీత తల్లే సందీప్ గైక్వాడ్ కిడ్నాప్ చేయమని చెప్పిందని, అందుకే సందీప్ గైక్వాడ్ ను మేము కిడ్నాప్ చేశామని తెలిపారు. కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం వచ్చి గట్టిగా విచారించే సరికి సందీప్ గైక్వాడ్ అసలు నిజాలు బయట పెట్టాడు. నా ఇద్దరు భార్యలు నన్ను పూర్తిగా పట్టించుకోవడం లేదని, దీని కోసమే సింపతి కోసం ఈ కిడ్నాప్ డ్రామా ఆడానని సందీప్ గైక్వాడ్ పోలీసుల విచారణలో తెలిపాడు. దీంతో పోలీసులకు చుక్కలు చూపించిన ఈ కేసులో సందీప్ గైక్వాడ్ అతని స్నేహితులను అరెస్ట్ చేశారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది.