నేటికాలంలో దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. ఇళ్లు, బ్యాంకులు, కార్యాలయాల్లో పడి దొరికిన కాడి దొచుకెళ్తుంటారు. అయితే కొన్ని సార్లు చోరీకి యత్నించిన సమయంలో దొరికిపోయి.. స్థానికుల చేతుల్లో చావుదెబ్బలు తింటారు. ఇలా కొందరు దొంగలు ప్రాణాలు సైతం పోయిన ఘటనలు అనేకం జరిగాయి. అయితే మరికొందరు దొంగలు అతి తెలివి ప్రదర్శించి ప్రాణాలు కాపాడుకుంటారు. తాజాగా ఓ దొంగ చోరీకి వెళ్లాడు. ఈ ప్రయత్నంలో దొరికిపోతానేమో అని తానే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఇక వివరాల్లోకి వెళ్తే..
బంగ్లాదేశ్ లోని బరిషల్ నగరంలో యాసిన్ ఖాన్ అనే 40 ఏళ్ల వ్యక్తి దొంగతనం చేసేందుకు ఓ దుకాణంలోకి చొరబడ్డాడు. దుకాణంలో వస్తువులను చూసిన యాసిన్ ఖాన్ కి ఇక పండగే పండగా అని ఫీలయ్యాడు. షాపులోని అన్ని వస్తువులను చోరీ చేయాలని భావించాడు. ఈ క్రమంలో అన్ని వస్తువులను దొంగిలించే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. పని పూర్తి చేసుకున్న తర్వాత బయటకు రావాలనుకున్నాడు. కానీ దొంగతనంలో పడి సమయం మరిచిపోయాడు. ఆ దొంగ బయటకు వెళ్లేందుకు ద్వారం వద్దకు రాగా బయట నుంచి వెలుతురు కనిపించడం, జనం మాటలు వినిపించడంతో తెల్లారిందని అర్ధమైంది. ఇక కొద్ది సేపు ఉంటే దుకాణ యజమాని కూడా వచ్చేసి.. తనను చావబాదుతాడని ఆ దొంగ భయపడ్డాడు.
తాను వారి చేతికి చిక్కితే చనిపోవడం ఖాయం అని వెన్నులో వణుకు మొదలైంది. వీరి చేతుల్లో చావడం కంటే పోలీసులకు చిక్కడం మేలు అన్నుకున్నాడో ఏమో.. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న పోలీసులు.. లోపలికి వెళ్లి సదరు వ్యక్తిని పట్టుకుని అరెస్ట్ చేశారు. నేరం చేసిన వ్యక్తి పోలీసులకు ఫోన్ చేయడం తన పదేళ్ల సర్వీసులో తొలిసారి చూశానని స్థానిక పోలీస్ అధికారి అసదుజ్ జమాన్ అన్నారు. అయితే కాసేపటికి దుకాణం తెరిచేందుకు అక్కడి వెళ్లిన యజమానికి ..పోలీసులు కనిపించారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక కొద్ది సేపు అయోమయానికి గురయ్యాడు. ఆ తర్వాత పోలీసుల ద్వార అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నాడు.
అయితే ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి దొంగతనాల్లో ఆరితేరినవాడని, చోరీకి ప్రయత్నించాడనే కారణంతో అరెస్ట్ చేసి జైలుకు పంపామని పేర్కొన్నారు. పోలీసులకు పట్టుబడినా జనం చేతుల్లో చావు దెబ్బలు తినకుండా క్షేమంగా బయటపడినందుకు దొంగ యానిస్ ఖాన్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. ‘ఈ దొంగ సామాన్యుల చేతిలో చావడం కంటే పోలీసులతో తన్నులు తినడం మేలనుకున్నాడు’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.