Crime News: భర్త అంటే భరించేవాడని అంటుంటారు. అలాంటి భర్తలే భార్యల పాలిట మృత్యు పాశంగా మారుతున్నారు. చిన్న చిన్న విషయాలకు భార్యల ప్రాణాలు తీస్తున్నారు. భార్య తాను చెప్పిన పని చేయలేదని ఓ భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి పాశవికంగా చంపేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన మహ్మద్ షేక్, రూపాలి చందన్ శివ్ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ పెళ్లి రూపాలి కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి ఇప్పటికి మూడేళ్లు అవుతోంది.
వీరి ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఆ బాబు వయసు రెండు సంవత్సరాలు. మహ్మద్ దంపతులు ప్రస్తుతం తిలక్ నగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే, పెళ్లి తర్వాత కొన్ని నెలలు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. తమ కట్టుబాట్లు ఫాలో కావాలని మహ్మద్, రూపాలిపై ఒత్తిడి తెస్తూ వస్తున్నాడు. అతడి కుటుంబం కూడా రూపాలిపై ఒత్తిడి తెచ్చేది. రూపాలి వారి మాటలు లెక్క చేసేది కాదు. ఇక ఈ విషయమై భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. గొడవల కారణంగా భార్యభర్తలు గతకొన్ని నెలలనుంచి వేరుగా ఉంటున్నారు. అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఆ మాట్లాడుకోవటం కూడా పోట్లాడుకోవటమే. ఓ రోజు రూపాలి తనకు విడాకులు కావాలని భర్తను అడిగింది. అందుకు అతడు ఒప్పుకోలేదు.
తర్వాత ఆమె కూడా విడాకుల సంగతి మర్చిపోయింది. తాజాగా, మహ్మద్ భార్యకు ఫోన్ చేసి తనకు తన కొడుకును ఇచ్చేయాలని రూపాలిని కోరాడు. ఆమె ఇందుకు ససేమీరా అంది. ఇక ఇలా అయితే కుదరదని భావించిన మహ్మద్ సెప్టెంబర్ 26, సోమవారం రాత్రి వేళ భార్య దగ్గరకు వెళ్లాడు. ఇంటికి రావాలని అడిగాడు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. విడాకులు కావాలని మరోసారి అడిగింది. దీంతో మహ్మద్ విచక్షణ కోల్పోయాడు. భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు, చేతులు కోశాడు. తీవ్రగాయాలపాలైన రూపాలి అక్కడికక్కడే చనిపోయింది. కత్తి దాడి అనంతరం మహ్మద్ అక్కడినుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికోసం గాలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : నిత్య పెళ్లి కూతురి లీలలు! 6 మంది భర్తలు చాలక ఇంకొకడితో!