పెళ్లైన చాలా మంది దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో కనిపించిన దేవుడికల్లా మొక్కుతూ పూజలు చేస్తుంటారు. కానీ ఇంకొందరైతే పుట్టిన బిడ్డలను పోషించలేక, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారంటూ.. ఇలా అనేక కారణాలతో కన్న పిల్లలను చంపేందుకు అనేక ఎత్తుగడలు వేస్తున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు నెలలు నిండని పసి బిడ్డను గొంతు నులిమి హత్య చేసింది. గతేడాది చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనపై కోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది.
అసలేం జరిగిందంటే? మధ్యప్రదేశ్ నర్మదాపురాని పరిధిలోని ఖోజన్ పూర్ లో దుర్గేష్, పూజా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కొడుకు జన్మించారు. ఇదిలా ఉంటే గతేడాది ఈ దంపతులుకు మరో కూతురు జన్మించింది. అయితే కూతురు పుట్టిందని సంతోషపడాల్సిన ఆ దంపతులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఉన్న బిడ్డలనే పోషించలేక సతమతమవుతుంటే మళ్లీ కూతురే పుట్టిందా అంటూ పూజా తీవ్రంగా బాధపడింది. ఇక ఆ మహిళ బాధపడడంతోనే సరిపెట్టలేదు. ఆ తర్వాత పుట్టిన బిడ్డను ఎలా చంపాలనే ప్లాన్ గీసింది.
కూతురు పుట్టి నెల కూడా కాలేదు చంపేందుకు పక్కా ప్లాన్ తో ముందుకు కదిలింది. అయితే గతేడాది డిసెంబర్ 7న పూజా ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి నెలలు నిండని కూతురుని గొంతు నులిమి హత్య చేసింది. ఇక అత్తమామలు, భర్త వచ్చి ఏం జరిగిందని ప్రశ్నించగా.. నేను స్నానం చేయడానికి వెళ్లానని, వచ్చేలోపే బిడ్డ బెడ్ పై నుంచి కిందపడి చనిపోయి ఉందని కట్టు కథ అల్లింది. ఎందుకో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు.
అనంతరం ఆ పసి బిడ్డకు పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా రిపోర్టులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గొంతు నులిమి హత్య చేసిన కారణంగానే ఆ బాలిక మరణించిదని పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడైంది. దీంతో పోలీసులు తల్లిని విచారించగా నేనే హత్య చేశానంటూ తన తప్పును ఒప్పుకుంది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసుపై కోర్టు విచారించి సంచలన తీర్పును వెల్లడించింది. ఇంత దారుణానికి పాల్పడ్డ మహిళకు యావజ్జీవ శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక కోర్టు ఇచ్చిన తీర్పులో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.