అతడికి విడాకులు అయ్యాయని తెలుసు. అయినా ప్రేమించింది. ఆ ప్రేమకాస్తా పెళ్లికి దారి తీసింది. దాంతో ఇంట్లో వారికి తెలియకుండానే అతడిని వివాహం చేసుకుంది. ఎన్నో ఆశలతో, ఊహలతో సంతోషంగా జీవితాన్ని గడుపుదాం అనుకుంది. కానీ ఆ తర్వాతే తెలిసింది తాను ఎంత పెద్ద తప్పు చేసిందో. ఆ తప్పు ఫలితంగా తన ప్రాణాలనే తీసుకుంది ఆ యువతి. ఏకంగా పోలీసు స్టేషన్ ఎదుటే పెట్రోలు పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. గురువారం విశాఖపట్నంలో జరిగిన ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రావణి(22) విశాఖపట్నంలోని ఓ ప్రయివేట్ కాలేజీలో న్యాయవిద్య చదువుతోంది. వినయ్ కుమార్ అనే వ్యక్తి కూడా అదే కాలేజీలో లా చదువుతున్నాడు. అతడికి ఇదివరకే పెళ్లి అయ్యి విడాకులు తీసుకున్నాడు. కాలేజీలో వినయ్ కుమార్, శ్రావణికి సీనియర్ కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో.. పెళ్లైన వ్యక్తి అని కూడా చూడకుండా శ్రావణి జూన్ నెలలో వినయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు తెలియదు. ఒకవైపు లా చదువుతూనే శ్రావణి ఓ పార్ట్ టైమ్ ఉద్యోగం, వినయ్ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. వివాహం జరిగిన ఐదు నెలల వరకు ఇద్దరి వైహహిక జీవితం సాఫీగానే సాగింది. 5 నెలల తర్వాతే మెుదలైంది అసలు కథ. రోజులు గడుస్తున్న కొద్ది ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. మెుదటి భార్య దగ్గరికి వెళ్లిపోతానని తరచూ వినయ్ గొడవకు దిగేవాడని శ్రావణి తెలిపింది.
ఈ క్రమంలోనే ఓపిక నశించిన శ్రావణి మూడు రోజుల క్రితం భర్త వినయ్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు గురువారం ఇద్దరిని కౌన్సిలింగ్ కు రమ్మన్నారు. వారిద్దరు స్టేషన్ కు రావడంతో ఎస్.ఐ. శ్రీనివాస్ వారికి కౌన్సిలింగ్ ప్రారంభించాడు. ఈ క్రమంలోనే కౌన్సిలింగ్ మధ్యలోనే కిందకు వచ్చిన శ్రావణి.. ‘నేనే తప్పు చేశా” “నేనే తప్పు చేశా” అంటూ గట్టిగా అరుస్తూ.. తనతో పాటే తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. విషయం తెలిసి పోలీసులు కిందికి వచ్చే లోపే శ్రావణి నిప్పంటించుకుంది. దాంతో ఆమెను ఆపటానికి ప్రయత్నించిన ఎస్.ఐ చేతిగా గాయాలు అయ్యాయి. మంటలు వెంటనే ఆర్పిన పోలీసులు ఆమెను హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదు. ఆస్పత్రిలో చేర్చిన కొద్దిసేపటికే శరీరం బాగా కాలిపోవడంతో.. శ్రావణి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.