కాలం మారుతున్న కొద్ది పిల్లల పెంపకంలోను అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటిలా పిల్లలను ఇష్టా రీతిన దండించడం.. తిట్టడం ఇప్పుడు చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. ప్రేమగా మందలించినా సరే.. పిల్లలు మాత్రం పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.
కొప్పర పంచాయతి కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) అనే మైనర్ బాలిక శుక్రవారం మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర –రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ రొంగలి దేవానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి విజయవాడ పడమటి రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లడంతో తాను మాత్రమే ఊరిలోనే ఉంటూ చదువుకుంటోంది. అయితే తల్లిదండ్రులు ఇటీవలే సంక్రాంతికి సొంతూరు వచ్చారు.
ఇది కూడా చదవండి : కుమార్తెని వ్యభిచారం చేయాలంటూ బలవంత పెట్టిన తల్లిదండ్రులు!
ఈ క్రమంలో శ్రావణి సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి సమీపంలోని వంతెన పైనుంచి నీటిలో దూకేసింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.