హాయిగా సాగిపోతున్న కాపురం. కానీ ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని బలిగొన్నాయి. ఈ సమస్యలను ఎదుర్కొలేక ఓ వ్యక్తి అందమైన భార్యను, బంగారం లాంటి పాపను బలితీసుకున్నాడు. ఆ తర్వాత..
కష్ట నష్టాలు, ఒడిదుడుకుల సమాహారమే సంసారం. అటువంటి సంసారంలో కలతలు, ఆర్థిక ఇబ్బందులు, అనుమానాలు వంటి కారణాలతో నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. సమస్యను బూతద్దంలో చూసుకుంటూ తమకే కష్టాలు వచ్చినట్లు కుంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. పచ్చని కాపురాన్ని నెత్తుటి మరకలతో ముగిస్తున్నారు. అందమైన కుటుంబాన్ని తమ చేతులతోనే కాలరాసుకుంటున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందులు తాళలేకే ఓ వ్యక్తి భార్యను, కుమార్తెను చంపి, అతడూ ఊపిరి తీసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
వారిదో అందమైన కుటుంబం. వారికో ముద్దుల పాప. ఆపాపకు ఇషా అని పేరు పెట్టుకున్నారు. అందంగా సాగిపోతున్న వారి కాపురంలో ఆర్థిక ఇబ్బందులు మృత్యువులా వచ్చాయి. కోరాపూట్ జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి తోయపుట్ గ్రామంలో నివసిస్తున్నారు లింగరాజు బిశోయ్, జ్యోత్స్యల జంట. లింగరాజు బిశోయ్ స్థానికంగా సెల్ ఫోన్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా అతడిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దీంతో మానసికంగా కుంగిపోయాడు. అప్పు ఇచ్చిన వాళ్లు సైతం ఎప్పుడిస్తావంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఆదివారం సాయంత్రం షాప్ కు వెళ్లి.. ఇంటికి వచ్చిన అతడూ.. తలుపులు వేసి.. భార్య జోత్స్య మెడకు సెల్ ఫోన్ చార్జర్ బిగించి చంపేశాడు.
తన తండ్రి చర్య గురించి తెలియని రెండేళ్ల చిన్నారి ఇషాను సైతం క్షణికాలోచన బలిగొంది. తన రెండేళ్ల కుమార్తె గొంతుకు తాడు చుట్టి చంపేశాడు కసాయి తండ్రి. అనంతరం తానూ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రాత్రి తొమ్మిది అవుతున్నా ఇంట్లో నుండి ఎవ్వరూ రాకపోవడంతో పాటు నిశబ్ధంగా అనిపించడంతో పొరిగింటి వారూ వెళ్లి చూడగా, తలుపులు వేసి ఉన్నాయి. పిలిచినా పలకకపోయే సరికి, మరికొంత మందిని పిలిచారు. వీరంతా కలిసి తలుపులు విరగొట్టి చూడగా, ఒకే గదిలో ముగ్గురు విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను శవ పరీక్షకు తరలించారు. ఈ ఇంటిని సీజ్ చేశారు. అక్కడి వారు ఇచ్చిన సమాచారంతో ఆర్థిక ఇబ్బందులతోనే లింగరాజు.. భార్య, పిల్లలను హత్య చేసి, తాను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేశారు.