ఆ యువతికి చదువుంటే ఎంతో ఇష్టం. అందుకే పెళ్లి అయినా గానీ చదువును మానెయ్యలేదు. ఇక ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో కి అడుగుపెట్టింది ఆ యువతి. భర్తతో కలిసి తన జీవితాన్ని సుఖ సంతోషాలతో ఎంజాయ్ చేయాలని కలలు కనింది. ఈ క్రమంలోనే డిసెంబర్ 13న రోజూలాగే కాలేజికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన బెంగళూర్ లోని కలబుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నావదగి గ్రామానికి చెందిన సృష్టి మారుతి(21)కి ఇటీవలే వివాహం జరిగింది. చదువు మీద ఉన్న ఇష్టంతో.. పెళ్లి అయినాగానీ చదువును కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం మారుతి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోట గ్రామం నుంచే తను కాలేజీకి వెళ్లేది, అది తన అత్తగారిల్లు. ఇక రోజూలాగే డిసెంబర్ 13 కాలేజీకి వెళ్లోస్తానని చెప్పి వెళ్లింది.. కానీ ఇంటికి మాత్రం తిరిగి రాలేదు. దాంతో కుటుంబ సభ్యులు ఆ రోజంతా బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ వెతికారు. కానీ సృష్టి మారుతి ఎక్కడా కనిపించలేదు.
దాంతో కుటుంబ సభ్యులు తెల్లారి మహాగాంవ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాలింపు చేపట్టిన పోలీసులకు శనివారం కురికోటా వంతెన వద్ద నదిలో సృష్టి మారుతి మృతదేహం లభ్యం అయ్యింది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే మరుతి ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎవరైనా ఇక్కడ చంపి పడేశారా? అన్న కోణంలో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా పెళ్లై నెల రోజులే కావడం.. సృష్టి ఇలా మరణించడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.