మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంతరిక్షాన్ని కూడా శాసించే స్థితికి చేరుకున్నాడు. తనకు సాధ్యం కానిది ఏదీ లేదు అని నిరూపించుకుంటూనే ఉన్నాడు. నింగి, నేల, సముద్రం ఎక్కడైనా తనదే పైచేయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతూనే ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు.. అంటూనే మంత్రాల నెపంతో మనుషులను అతి కిరాతకంగా, అత్యంత క్రూరంగా హింసించి, హత్యలు చేస్తున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటనే జగిత్యాల జిల్లాలో వెలుగు చూసింది. మంత్రాలు వేస్తున్నారంటూ ఓ తండ్రి, అతని ఇద్దరు కుమారులను కత్తులు, బరిసెలతో అత్యంత కిరాతకంగా పొడిచి చంపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాలలోని ఎరుకలవాడలో జగన్నాథం నాగేశ్వరరావు(60) నివాసం ఉంటున్నాడు. అతనికి దగ్గర్లోనే కుమారులు కూడా ఉంటున్నారు. అందరూ ఎప్పటిలాగే స్థానింకగా జరిగే కులసంఘం సమావేశానికి హాజరయ్యారు. అప్పటికే గుంపులో ఎదురుచూస్తున్న ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తులు, బరిసెలతో దాడి చేశారు. అందరూ చూస్తుండగానే నాగేశ్వరరావు, కుమారులపై దాడికి తెగబడ్డారు. అసలు అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే.. నాగేశ్వరరావు, రమేశ్ రక్తపు మడుగులో విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రమేశ్ ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా తుది శ్వాస విడిచాడు. మూడో కుమారుడు రాజేశ్ అక్కడి నుంచి పారిపోవడంతో ప్రాణాలతో మిగిలాడు.
ఇది కూడా చదవండి : ఆ న్యూడ్ వీడియో కాల్ విలువ రూ.10 లక్షలు! డేటింగ్ యాప్ పేరుతో భారీ మోసం!
ఈ హత్యాకాండ పక్కా ప్రణాళికతోనే జరిగి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాగేశ్వరరావు కుటుంబంతో శత్రుత్వం ఉన్న వారే ఈ పని చేసుంటారని.. అందుకు మంత్రాల నెపాన్ని వాడుకున్నారని పోలీసులు విశ్వసిస్తున్నారు. ప్రణాళిక ప్రకారమే వారు ఆయుధాలతో సమావేశానికి హాజరై వారిలో కలిసిపోయి దాడికి పాల్పడ్డారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాడికి ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆరుగురి కంటే ఎక్కువ మంది దాడిలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు. వారు అత్యంత కిరాతకంగా కత్తులు, బరిసెలతో ఛాతీ, గొంతు భాగాల్లో దాడి చేశారు. ఈ ఘటనను చూసిన కుటుంబ సభ్యులు, పిల్లలు గుండలవిసేలా విలపించారు. వారి రోధన అక్కడి వాళ్ల హృదయాలను కలచివేసింది.
జనగామ జిల్లాలో జఫర్ గఢ్ మండలం కాషాగూడెంలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. ఓ గర్భిణికి 15 రోజులుగా కడుపులో మంట, నొప్పి వస్తుండటంతో చాలా ఆస్పత్రుల్లో చూపించారు. ఎక్కడా సమస్య ఏంటనేది తెలియలేదు. ఎవరో మంత్రం వేసుంటారనుకుని.. పక్కింటి గోరేమియాపై అనుమానం పెంచుకున్నారు. బంధువులను పిలిపించి కర్రలతో గోరేమియాపై దాడికి పాల్పడ్డారు. ఈ మూఢనమ్మకాలకు ఎప్పుడు ముగింపు పడుతుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.