తల్లిదండ్రలు మందలించారని, రీల్స్ చేయొద్దన్నారని.. ఇలా రకరకాల కారణాలతో కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఘటనలు మరువకముందే తాజాగా మరో బాలుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
ఈ మధ్యకాలంలో చాలా మంది ప్రతీ చిన్న సమస్యకు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రియుడు మోసం చేశాడని, తల్లిదండ్రులు మందలించారని, చదువులో రాణించలేకపోతున్నానని, రీల్స్ చేయొద్దన్నారని.. ఇలా రక రకాల కారణాలతో చివరికి ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. సరిగ్గా ఇలాగే అడుగులు వేసిన ఓ 12 ఏళ్ల బాలుడు.. టీవీ, సెల్ ఫోన్ రీఛార్జ్ చేయించలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామంలో యశోద అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. యశోద భర్త గత రెండేళ్ల క్రితమే మరణించాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను చూసుకుంటుంది. అయితే పెద్ద కుమారుడు తరుణ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. ఇదిలా ఉంటే.. గత కొన్నిరోజుల నుంచి వీరి ఇంట్లో టీవీ రావడం లేదు. దీంతో పాటు మొబైల్ ఫోన్ రీఛార్జ్ కూడా అయిపోయింది. ఈ క్రమంలోనే పెద్ద కుమారుడు తరుణ్ టీవీ, ఫోన్ రీచార్జ్ చేయించాలని ఇటీవల తల్లిని కోరాడు. టీవీ వైర్లను ఎలుకలు కోరికాయని, రిపేర్ చేయించి టీవీ, మొబైల్ ఫోన్ రెండూ ఒకేసారి రీఛార్జ్ చేయిస్తానని తల్లి కుమారుడికి వివరించింది.
ఇవేం వినని ఆ బాలుడు.. లేదు ఇప్పుడే రీఛార్జ్ చేయించాలని అరిచాడు. కోపంతో ఊగిపోయిన తల్లి యశోద పెద్ద కుమారుడిని మందలించి పొలానికి వెళ్లిపోయింది. దీంతో ఆ బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక అదే రోజు మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో తరుణ్.. ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే ఆ బాలుడిని కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. ఆ బాలుడు అప్పటికే మరణించాడని తెలిపారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న తల్లి యశోద గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రీఛార్జ్ చేయించలేదని క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్న తరుణ్ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.