ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారిన పడి మరణిస్తున్నారు. ఎక్కువగా వ్యాయామం, డ్యాన్సులు, తీవ్ర ఒత్తిడికి గురై హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. చిన్నా పెద్దా అనే వయసు తేడా లేకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకప్పుడు యాభై ఏళ్ళు దాటిన వారికి గుండెపోటు, ఇతర గుండె సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తేవి… కానీ ఇప్పుడు యువత వరుసగా హర్ట్ ఎటాక్ తో చనిపోతున్నారు. ఎక్కవ ఒత్తిడికి గురైనపుడు, ఎక్కువగా వ్యాయామం చేసినపుడు, శుభకార్యాల్లో డీజే సౌండ్స్ వినుకుంటూ డ్యాన్సులు చేస్తున్నప్పుడు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్న వాళ్లు హఠాత్తుగా ప్రాణాలో కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని కన్నుమూసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ జిల్లా కొత్తగడి లోని గురుకుల పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ఇంటర్ విద్యార్థిని కన్నుమూసింది. గురుకుల ప్రిన్సిపల్ అపర్ణ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం బక్కారం గ్రామానికి చెందిన నందిని (16) వికారాబాద్ పట్టణం కొత్తగడిలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. గురువారం ఉదయం నందినికి శ్వాస సంబంధిత సమస్య రావడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను వికారాబాద్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. నందినికి పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు.
గురువారం నందిని అనే విద్యార్థినికి గుండెపోటు రావడంతో హుటాహుటిన వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చామని.. ఆమెను పరీక్షించిన వైద్యలు అప్పటికే చనిపోయినట్లు తెలిపారని ప్రిన్సిపల్ అపర్ణ చెప్పారు. ఈ విషయాన్ని నందిని కుటుంబ సభ్యులకు తెలిపామని అన్నారు. తన కూతురు మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని నందిని తల్లి వెంకటమ్మ తెలిపింది. స్కూల్ ప్రిన్సిపల్, కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ పట్టణ సీఐ తెలిపారు. అప్పటి వరకు తమతో ఎంతో సంతోషంగా గడిపిన నందని చనిపోవడంతో సహవిద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు.