ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా హైదరాబాద్ లో ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలుసా?
ఈ మధ్యకాలంలో కొందరు విద్యార్థులు చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకుని కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రేమలో విఫలమయ్యానని, చదువులో రాణించలేకపోతున్నాననే కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక అచ్చం ఇలాగే ఓ విద్యార్థి హాస్టల్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే
నల్గొండ పట్టణానికి చెందిన దినేష్ (22) అనే యువకుడు హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఓ హాస్టల్ లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంసీఏ చదువుతున్నాడు. అయితే ఇటీవల కాలేజీకి వెళ్లిన ఆ యువకుడు తిరిగి హాస్టల్ కు వచ్చాడు. ఇక తన గదిలోకి వెళ్లిన దినేష్.. చాలా సమయం అయినా బయటకు రాలేదు. దీంతో అనుమానం వచ్చిన హాస్టల్ ఇబ్బంది.. అతడు ఉన్న గది తలుపులు తీసేందుకు ప్రయత్నించారు. కానీ, అతడు లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడని తెలుసుకుని కిటికి లోంచి తొంగి చూడగా.. ఆ యువకుడు ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. ఖంగుతిన్న సిబ్బంది వెంటనే ఆ యువకుడి తల్లిదండ్రులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దినేష్ తల్లిదండ్రులు వెంటనే హైదరాబాద్ కు వచ్చారు. కుమారుడిని అలా చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు అతని స్నేహితులను విచారించారు. దినేష్ గత కొన్ని రోజుల నుంచి కాస్త డల్ గా కనిపించాడని స్నేహితులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మరో విషయం ఏంటంటే? మృతుడు చనిపోయే ముందు.. మిస్ యూ అమ్మానాన్న, అన్న, ఫ్రెండ్స్ అంటూ సూసైడ్ నోట్ లో రాసినట్లుగా సమాచారం. అయితే దినేష్ తల్లిదండ్రులు మాత్రం మా కుమారుడి మరణంపై మాకు అనుమానాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.