ఆయనో 60 ఏళ్ల వృద్ధుడు. భార్య చనిపోయి ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నాడు. అలాంటి ఆయన జీవితంలోకి ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు ఆయన్ని మోసం చేశారు. లక్షల రూపాయల డబ్బును దోచుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో ఆసల్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడి భార్య రెండేళ్ల క్రితం మరణించింది. అతడి పిల్లలు కూడా పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. దీంతో ఆయన ఒంటరిగా కాలం వెల్లదీస్తున్నాడు. వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాడు. షుగర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆయన తనకు ఓ తోడు కావాలని అనుకున్నాడు. ఓ రోజు పేపర్‌లో చూసి పెళ్లిళ్ల బ్రోకర్‌కు ఫోన్ చేశాడు. అటునుంచి ఓ యువతి ఫోన్ తీసింది.
3 వేల రూపాయలు తమ ఖాతాలో జమ చేయాలని కోరింది. 3 వేలు పంపిన తర్వాత ఆ యువతి ఓ మహిళ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆయన ఆ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఓ మహిళ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆయన తన వివరాలు మొత్తం చెప్పాడు. ఆమె ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. తర్వాత ఇద్దరూ ఫోన్‌లో బాగా మాట్లాడుకునేవారు. ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఆ మహిళ తనకు లక్ష రూపాయలు అవసరం ఉందని అడిగింది. ఆయన డబ్బులు పంపాడు. తర్వాతినుంచి ఆమె వృద్ధుడితో ఫోన్ మాట్లాడటం మానేసింది. రెండు రోజుల తర్వాత మరో మహిళ ఆయనకు ఫోన్ చేసింది. తనకు ఎవరూ లేరని, ఒంటరిగా ఉన్నానని ఆయన్ని నమ్మించింది. ఆయన ఆమె మాటలకు ఐస్ అయిపోయాడు. ఇద్దరూ కొన్ని రోజులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు.
ఓ రోజు ఆ మహిళ కూడా తనకు లక్ష రూపాయలు కావాలని అడిగింది. వృద్ధుడు ఏమాత్రం ఆలోచించకుండా డబ్బులు పంపేశాడు. ఇక, అప్పటినుంచి ఆమె కూడా ఫోన్ మాట్లాడటం ఆపేసింది. వృద్ధుడు బాధలో ఉండగానే మరో మహిళ ఆయనకు ఫోన్ చేసింది. పెళ్లిళ్ల బ్రోకర్ తనకు నెంబర్ ఇచ్చినట్లు ఆయనతో చెప్పింది. అయితే, ఇంతకు ముందు రెండు సార్లు దెబ్బ తిన్న ఆయన ఆమెను కొన్ని రోజులు పట్టించుకోలేదు. పదేపదే ఆమె ఫోన్ చేస్తుంటే మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈమె కూడా ముసలాయన్ని తన మాటలతో ఐస్ చేసింది. తనకు కోట్ల ఆస్తి ఉందని, వేరే వాళ్లను మోసం చేయాల్సిన అవసరం లేదని అంది. దీంతో ఆ వృద్ధుడు ఆమె మాయలో పడిపోయాడు. ఇలా ఇద్దరూ కొన్ని రోజులు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఓ రోజు ఆయన పెళ్లి ప్రస్తావన తెస్తే.. తనకు పెళ్లి ఇష్టమేనని ఆమె అంది. ఓ రోజు వీడియో కాల్ చేయాలని ఓ లింక్ పంపింది. అయితే, ఆయనది కీప్యాడ్ ఫోన్ కావటంతో వీడియో కాల్ చేయటానికి కుదరలేదు. ఓ రోజు ఆమె వృద్ధుడికి ఫోన్ చేసింది. అమ్మమ్మ ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు అవసరం ఉన్నాయని అడిగింది. వారంలో తిరిగి ఇస్తానని చెప్పటంతో ఆయన డబ్బులు ఇచ్చాడు. ఇందుకోసం బ్యాంకులో భార్య నగలు కుదువ పెట్టాడు. ఈ సారి ఆమెను నేరుగా కలిశాడు. అయినప్పటికి అనర్థం జరిగిపోయింది. ఆయన దగ్గరినుంచి డబ్బులు తీసుకుని ఆమె జంప్ అయింది. తర్వాత ఆమె కూడా ఫోన్ తీయటం ఆపేసింది.