Crime News: మానసిక ఒత్తిడి.. గత కొన్నేళ్లుగా జనాలను పట్టి పీడుస్తున్న మహమ్మారి. ఈ మానసిక ఒత్తిడి కారణంగా చదువులేని వారి దగ్గరినుంచి.. పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నవారి వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మానసిక ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్న వారి లిస్ట్ పెద్దదే ఉంది. తాజాగా, ఆ లిస్ట్‌లోకి ఓ ప్రముఖ ఫోరెన్సిక్ సైకాలజీ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ చేరింది. ఎన్నో నేరాలను ఛేదించటంలో సహాయపడ్డ ఆమె ఒత్తిడి కారణంగా ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బెంగళూరులోని మడివాడకు చెందిన శృతి ఫోరెన్సిక్ సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఆఫీసర్‌గా పనిచేస్తోంది.
గత కొద్ది రోజుల నుంచి ఆమె మానసిక ఒత్తిడితో తీవ్రంగా పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఒత్తిడికి తల ఒగ్గింది. ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఇంట్లోని తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గదిలో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ దొరికింది. ఆ సూసైడ్ నోట్‌లో ‘‘ నా చావుకు నేనే కారణం’’ అని రాసి ఉంది. ఇక, పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్త ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శృతి కొన్ని నెలల క్రితమే భర్తతో విడాకులు తీసుకుందని విచారణలో తేలింది. ఇక, అప్పటినుంచి ఆమె ఒంటరిగా ఉంటున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.