ఒక మనిషి ప్రైవేటు కంపెనీ లేదా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగంలో చేరాలంటే ఖచ్చితంగా చదువు ఉండాల్సిందే. దానికి సర్టిఫికెట్ రుజువు ఉండాలి. సర్టిఫికెట్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది. అయితే కొంతమంది ఉద్యోగం కోసం అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. చదవకపోయినా పెద్ద కాలేజ్ లో చదివినట్టు నకిలీ సర్టిఫికెట్లు తెచ్చేసుకుని ఉద్యోగాలు సంపాదించేస్తున్నారు. దీని కోసం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసే సంస్థలకు భారీగా ముట్టజెప్తున్నారు. తాజాగా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం బట్టబయలైంది.
‘ఆంధ్ర యూనివర్సిటీలో కావాల్నా? జేఎన్టీయూలో కావాల్నా? ఏ కాలేజ్ లో చదివినట్టు సర్టిఫికెట్ కావాలో చెప్తే ఇచ్చేస్తాం. అందుకోసం ఒక లకారం తీసుకుంటాం’ ఇదీ నకిలీ సర్టిఫికెట్ల తయారీ సంస్థల వ్యవహారం. ఒడిశాలోని బలంగీర్ లో నకిలీ సర్టిఫికెట్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోస్టల్ ఉద్యోగాల కోసం బూటకపు విద్యార్హతలతో నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తుండడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో ఇప్పటి వరకూ 21 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో 19 మంది నిరుద్యోగ యువకులు, కోచింగ్ సెంటర్ యజమాని, కంప్యూటర్ టీచర్ ఉన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని ఆధారంగా చేసుకుని సాగుతున్న ఈ దొంగ సర్టిఫికెట్ల వ్యవహారంపై సోదాలు జరిపారు.
ఈ సోదాల్లో రూ. 3,67,000 నగదుతో పాటు 41 ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన 1000 నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. అలానే వెరిఫికేషన్ రిపోర్టులు, 33 స్టాంపులు, 4 కంప్యూటర్లు, 2 ల్యాప్ టాప్ లు, జిరాక్స్ మెషిన్, ప్రింటర్, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, భూమి పత్రాలు వంటివి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ సర్టిఫికెట్లు అచ్చం ఒరిజినల్ సర్టిఫికెట్లలానే ఉన్నాయని ఎస్పీ వివరించారు. పలు విద్యాసంస్థల ఉద్యోగులతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యజమాని మనోజ్ మిశ్రా సంబంధాలు పెట్టుకుని నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం సాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించామని అన్నారు. ఈ వ్యవహారంలో భూముల అక్రమంగా కొనుగోలు చేసినట్లు బయటపడిందని, ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తుందని తెలిపారు.
ఇటీవల విడుదలైన బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, డాక్ సేవక్ వంటి 83 పోస్టుల భర్తీకి అభ్యర్థులు దాఖలు చేసిన మార్కుల షీట్లు, సర్టిఫికెట్లను పరిశీలించగా తేడాలు ఉన్నట్లు పోస్టల్ అధికారులు గుర్తించారు. దీంతో ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోస్టల్ ఉద్యోగాలకు దాఖలు చేసిన అభ్యర్థుల్లో 37 మంది ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుంచి నకిలీ మార్కుల షీట్లు, సర్టిఫికెట్లు పొందినట్లు తెలిసింది. ఇంగ్లీష్ లో ఒకరికి 98 శాతం, మరొకరికి 99 శాతం మార్కులు పొందినట్లు మార్కుల షీటులో ఉండడంతో అనుమానం వచ్చిన పోస్టల్ అధికారులు తీగ లాగడంతో డొంక కదిలింది. పోస్టల్ విభాగం ఈ ఇద్దరికీ ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించగా ఫెయిలయ్యారు.
ఆరా తీయడంతో ఒక అభ్యర్థి రూ. 50 వేలు పెట్టి బోర్డు పరీక్ష సర్టిఫికెట్ ను కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. గత 8, 10 ఏళ్ల నుంచి నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని సాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పదేళ్ళలో చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి నకిలీ సర్టిఫికెట్లు పొంది అక్రమంగా ఉద్యోగాల్లో చేరారని అన్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్యం యువకుల నుంచి ఒక్కో సర్టిఫికెట్ కి, ఒక్కో మార్కుల షీటుకి రూ. 1.50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందని అన్నారు. కొన్ని సందర్భాల్లో ఒక్కో సర్టిఫికెట్ ను రూ. 5 లక్షల వరకూ అమ్మినట్లు విచారణలో తేలిందని అన్నారు.