జార్ఖండ్‌లో దారుణం జరిగింది. వాకింగ్‌కు వెళ్లిన జడ్జిని ఆటోతో గుద్ది చంపారు. ఈ అమానుష ఘటన ధన్‌బాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. ధన్‌బాద్‌లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎడిజే ఉత్తమ్ ఆనంద్ బుధవారం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. ఆయన మేజిస్ట్రేట్ కాలనీ సమీపంలోని రణధీర్ వర్మ చౌక్ వద్దకు చేరుకోగానే ఒక ఆటో వెనుక నుంచి వచ్చి ఆయనను టార్గెట్‌గా చేసుకొని ఢీకొట్టింది.
దాంతో జడ్జి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే మరణించారు. పోలీసులు మొదట గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఆయనను జడ్జిగా గుర్తించారు. ఉత్తమ్ ఆనంద్ ఆరు నెలల క్రితమే ధన్‌బాద్‌లో జడ్జిగా నియమితులయ్యారు.
ఇదిలావుండగా ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం గమనార్హం.‘బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఒక ఆటో జడ్జిని వెనుక నుంచి ఢీకొట్టి వెళ్లిపోయింది. ఆ ఆటోను ఇంకా పట్టుకోలేదు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయం వెలుగుచూసింది.
పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు’ అని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ తెలిపారు.కాగా.. జడ్జిని ఢీకొట్టిన ఆటో దొంగిలించబడినదిగా పోలీసులు గుర్తించారు. ఆ ఆటో పతార్దిహ్ నివాసి అయిన సుగ్ని దేవి పేరిట రిజిస్టర్ చేయబడిందని పోలీసులు తెలిపారు.
ఆటో యజమానిని విచారించగా.. తమ ఆటో గత రాత్రి దొంగిలించబడిందని.. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఈ సంఘటన జరిగిందని సుగ్ని చెప్పారు. ఆటో యజమాని ఫిర్యాదుతో ధన్‌బాద్ పోలీసులు మరింత లోతుగా ఈ కేసు గురించి దర్యాప్తు చేస్తున్నారు.