ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను ప్రియుడు అత్యంత కిరాతకంగా చంపి..ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసిన సంగతి మర్చిపోక ముందే రాజస్థాన్ నాగౌర్‌లో పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడు.. ప్రేమించిన యువతిని దారుణంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. ఇప్పుడు మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇటీవల దేశంలో జరుగుతున్న హత్యలు ఒళ్లు గగొర్పుడుస్తున్నాయి. ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను ప్రియుడు అత్యంత కిరాతకంగా చంపి..ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసిన సంగతి మర్చిపోక ముందే రాజస్థాన్ నాగౌర్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు ప్రియుడు.. ప్రేమించిన యువతిని దారుణంగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. జమ్ముకాశ్మీర్‌లో గత నెలలో ఓ మహిళను ఈ విధంగానే హత్య చేశాడో దుర్మార్గుడు. ఇవన్నీ కూడా దేశాన్ని కుదిపేసిన ఘటనలే. తాజాగా రాజస్థాన్‌లో మరో ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉదయ్ పూర్‌లోని మావ్లీ బ్లాక్‌లోని లోప్డా గ్రామానికి చెందిన పూజ అనే తొమ్మిదేళ్ల బాలిక గత నెల 29 నుండి కనిపించకుండా పోయింది. అయితే తల్లిదండ్రులు పలు ప్రాంతాల్లో వెతికారు. కానీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆ గ్రామంలో ఓ పాడు బడిన ఇంట్లో నుండి దుర్వాసన వస్తుండటంతో గమనించిన వ్యక్తి వెళ్లి చూడగా.. మూడు మూటలో మృతదేహాల ముక్కలుగా కనిపించాయి. ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయగా.. అది పూజ మృతదేహంగా గుర్తించారు ఆమె కుటుంబ సభ్యులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించిన పోలీసులు అదే గ్రామానికి చెందిన కమలేష్ రాజ్ పుత్ (20)గా గుర్తించారు.
నిందితుడు పరారీలో ఉండగా.. ఓ అటవీ ప్రాంతంలో అతడిని గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో నేరస్థుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. మార్చి 29న బాధిత బాలిక తన మామ పొలాల వైపు వెళుతుండగా కనిపించిందని, ఆమెను అపహరించి, ఓ పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి, బాలికపై అత్యాచారం చేసి, ఆమెను చంపేసినట్లు చెప్పాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని 10 ముక్కలుగా నరికి 3 బ్యాగుల్లో నింపి ఆ ఇంట్లో వదిలేసి పరారయ్యానని తెలిపాడు. నిందితుడు బాధితురాలికి పొరుగు ఉంటారని, ఆమెపై అతడు కన్నేసినట్లు పోలీసులు చెప్పారు. బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతోందని వివరించారు. నిందితుడిపై ఐపిసిలోని సెక్షన్ 302 సెక్షన్ 363తో సహా పలు కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.