ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మన కళ్ల ముందు సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోతుంటారు. సాధారణంగా చిన్న పిల్లలు చాక్లెట్లు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అప్పుడప్పుడు చాక్లెట్లు గొంతులో ఇరుక్కొవడంతో ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు.. కొన్నిసార్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. వరంగల్ లో విషాదం చోటు చేసుకుంది.. అప్పటి వరకు ఆనందంగా అందరి ముందు అల్లరి చేసిన ఏడేళ్ల బాలుడు చాక్లెట్ తిని ప్రాణం విడిచాడు. దాంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ కి చెందిన కన్ గహన్ సింగ్ కొంత కాలం క్రితం వరంగల్ కి వచ్చి ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కన్ గహన్ కి భార్య, ముగ్గురు కుమారులు.. ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల వ్యాపార నిమిత్తం కన్‌గహాన్ ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడ నుంచి వచ్చేటపుడు తన పిల్లల కోసం ఎన్నో ఆటబొమ్మలతో పాటు చాక్లెట్స్ తీసుకువచ్చాడు. కానీ ఆ చాక్లేట్స్ తన కొడుకు ప్రాణాలు తీస్తాయని ఊహించలేకపోయాడు. కన్‌గహాన్ రెండో కుమారుడు సందీప్ ఓ ప్రైవేట్ స్కూల్ లో రెండో తరగతి చదువుతున్నాడు. పిల్లలను తన బైక్ పై ఎక్కించుకొని కన్‌గహాన్ స్కూల్ కి తీసుకొచ్చి వదిలివేళ్లాడు. పిల్లలు స్కూల్ కి వెళ్లే ముందు తల్లి గీత చాక్లెట్స్ ఇచ్చింది.
చాక్లెట్ తినుకుంటూ సందీప్ (8) తరగతి గదిలోకి వెళ్లిన కొద్ది సేపటికే స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే పాఠశాల యాజమాన్యం బాలుడి తండ్రి కన్ గహన్ కి సమాచారం అందించారు. హుటాహుటిన కన్‌గహాన్ పాఠశాలకు చేరుకొని చిన్నారిని తీసుకొని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు వెళ్లాడు. సందీప్ గొంతులో చాక్లెట్ ఇరుక్కుపోయినట్లు డాక్టర్లు గుర్తించి వెంటనే చికిత్స చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే సందీప్ కి ఊపిరాడక చనిపోయాడు. ఎంతో ప్రేమతో తీసుకు వచ్చిన చాక్లెట్ తన కొడుకు ప్రాణాలు పోవడంతపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.