దేశంలో వరకట్న వేధింపుల కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లి క్రమంలో కొందరు భర్తలు కోరినంత కట్నం తీసుకుని, పెళ్లైన కొన్నేళ్లకి మళ్లీ అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధిస్తూ చివరికి కటకటాల్లోకి వెళ్తున్నారు. అచ్చం ఇలాగే కాసుల కోసం కక్కుర్తిపడ్డ భర్త చివరికి కట్టుకున్న భార్య అన్న కనికరం లేకుండా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది బిహార్ లోని నవాడా పరిధిలోని ఫతాహ గ్రామం. ఇక్కడే గౌరీ శంకర్, సుగంధ కుమారి సిన్హా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2014లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అత్తింటి వాళ్లు గౌరీ శంకర్ కు బాగానే ముట్టజెప్పారు. ఇక భర్త గౌరీ శంకర్ ప్రముఖ సింగర్ గా ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇలా వీరి కాపురం సజావుగా సాగుతుందన్న క్రమంలోనే భర్త భార్యపై దారుణానికి పాల్పడ్డాడు. కాసుల కోసం కక్కుర్తిపడి భార్యను గత కొన్నేళ్ల నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో అత్తమామలు కలగజేసుకుని ఎన్నో సార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
అయినా తన వక్రబుద్దిని మార్చుకోని భర్త గౌరీ శంకర్ అదే పనిగా భార్యను వేధిస్తూ ఉండేవాడు. అయితే ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త గౌరీ శంకర్ భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ విషయం సుగుంధ తల్లిదండ్రులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ రక్తపు మడుగులో ఉన్న కూతురును చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం సుగుంధ తల్లిదండ్రులు భర్త, అత్తింటి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.