బెంగుళూరు రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భర్త భార్యపై ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. బెంగుళూరు రూరల్ జిల్లా హూస్కోట్ నగరంలో రమేష్, అర్పిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు ఏడేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు జన్మించారు. అలా కొన్నేళ్ల పాటు ఈ భార్యాభర్తల వైవాహిక జీవితం ఎలాంటి గొడవలు, మనస్పర్ధలు లేకుండా సంతోషంగా సాగుతూ వచ్చింది.
ఇలా వీరి కాపురం ఆనందంగా సాగుతుందని అనుకుంటున్న క్రమంలోనే వీరి సంసారంలో గతేడాది నుంచి గొడవలు, మనస్పర్ధలు వచ్చి చేరాయి. ఇక భరించలేని ఈ దంపతులు ఎట్టకేలకు విడాకులు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో కొంత కాలం నుంచి ఈ దంపతులు ఇద్దరు వేర్వేరుగా కూడా ఉంటున్నారు. అయితే ఈ క్రమంలోనే భర్త తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ తన భార్యతో కలిసి ఉండాలనుకున్నాడు. ఇదే విషయమై భర్త ఇటీవల భార్యకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ నేపథ్యంలోనే భర్త రమేష్ భార్య అర్పిత ప్రవర్తనపై కాస్త అనుమానం కలిగింది.
ఇందులో భాగంగానే ఆదివారం భర్త రమేష్ భార్యకు ఫోన్ చేసి పిల్లగుంపే ప్రాంతానికి రమ్మన్నాడు. భర్త మాటను కాదనని భార్య అతను చెప్పినట్టే అక్కడికి వెళ్లింది. ఇక వెళ్లిన అనంతరం ఇద్దరు మాట్లాడుకున్నారు. అది కాస్త గొడవకు దారి తీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా భార్యను కత్తితో పొడిచాడు. ఇక అనంతరం అదే కత్తితో భర్త తన కడుపులో పొడుచుకున్నాడు. ఈ ఘటనలో భార్య అర్పిత, భర్త రమేష్ రక్తపు మడుగులో పడి కొట్టుకున్నారు. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఈ దంపతులను ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ అర్పిత ప్రాణాలు కోల్పోగా, భర్త రమేష్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఈ దంపతుల పిల్లలు అనాథలయ్యారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.