Hyderabad: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే సంఘటన ఒకటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. ఓ చిన్నారిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నాలుగేళ్ల పాప అని చూడకుండా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు నెలలుగా పాపతో తన కామవాంఛ తీర్చుకుంటున్నాడు. మంగళవారం కూడా పాపపై అత్యాచారం చేశాడు. పాప అస్వస్థతకు గురవ్వటంతో తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ నేపథ్యంలోనే ఆ స్కూలు బండారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు, పిల్లల తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ పబ్లిక్ స్కూల్ ఉంది. రజినీ కుమార్ అనే వ్యక్తి ఆ స్కూల్ ప్రిన్సిపల్ మాధవి కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
అతడే స్కూలు బస్సు కూడా నడుపుతున్నాడు. మరో విషయం ఏంటంటే.. అతడే స్కూల్లో పిల్లలకు పాఠాలు కూడా చెబుతుంటాడు. గత కొంత కాలంనుంచి అతడు స్కూల్లోని పిల్లలను వేధిస్తూ వస్తున్నాడు. రెండు నెలల క్రితం అతడి కన్ను స్కూల్లో ఎల్‌కేజీ చదువుతున్న ఓ నాలుగేళ్ల చిన్నారిపై పడింది. గత రెండు నెలలనుంచి అతడు బాలికపై అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. బాలిక అతడి వేధింపులు భరిస్తూ వచ్చింది. అయితే, నిన్న కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారం అనంతరం బాలిక అస్వస్థతకు గురైంది. ఇంటి దగ్గరకు వెళ్లిన తర్వాత బాలిక నీరసంగా ఉండటంతో తల్లిదండ్రులు ఏమైందని ప్రశ్నించారు. బాలిక గట్టిగా ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక చెప్పింది విని వారు ఒక్కసారిగా షాక్ తిన్నారు.
నిందితుడిపై ఆగ్రహంతో ఊగిపోయారు. స్కూలు దగ్గరకు వెళ్లి రజనీ కుమార్‌ను నిలదీశారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో వారికి కోపం వచ్చింది. పాప తల్లిదండ్రులతో పాటు మరికొంతమంది అతడిపై దాడికి దిగారు. కట్టలు తెంచుకున్న కోపంతో అతడ్ని చితకబాదారు. ప్రిన్సిపల్ మాధవిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. ‘‘ ఈ ఘోరం బయటకు వచ్చే వరకు అతడు డ్రైవర్ అని మాకు తెలియదు. ఏ పీటీ టీచరో.. కంప్యూటర్ ల్యాబ్ సారో అనుకున్నాం. ఎప్పుడూ ప్రిన్సిపల్ రూము దగ్గర, ల్యాబ్ దగ్గర ఉండేవాడు.
క్లాస్‌లో టీచర్ లేకపోతే అతడు వచ్చి చూస్తాడంట. క్లాస్‌లోకి వెళ్లగానే డోర్ లాక్ చేస్తాడని మాకు తెలిసింది. దీనిపై కొంత మంది టీచర్లు ప్రిన్సిపల్‌కు కంప్లైంట్ చేశారంట. పిల్లలను స్కూల్లో సరిగా పట్టించుకోరు. రివర్స్‌లో మమ్మల్నే నిలదీస్తారు. ప్రిన్సిపల్ డ్రైవర్‌తో చాలా క్లోజ్‌గా ఉండేది. కారు డ్రైవర్ అయినప్పటికి ఆమె ముందు సీట్లో కూర్చునేది. క్యాష్ కౌంటర్ దగ్గర కూడా అతడు చాలా ఓవర్‌గా మాట్లాడేవాడు. అతడ్ని చూసినపుడు పిల్లలు భయపడేవారు ’’ అని చెబుతున్నారు. ఇక, బాధిత పాప తల్లిదండ్రులు నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వీలైతే ఎన్‌కౌంటర్ చేయాలని కోరుకుంటున్నారు.