ప్రేమ వ్యవహారం ఇద్దరు విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టింది. తోటి విదేయర్థిపై మరో విద్యార్థి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూంలో పరీక్ష రాస్తుండగా మొదలైన గొడవ కత్తులతో పొడుచుకునేవరకు దారితీసింది. ఇదంతా పరీక్ష హాల్లో టీచర్ల ముందే జరగడం గమనార్హం. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆ వివరాలు.. హరి సాయి, ఉదయ్ శంకర్ అను ఇద్దరు విద్యార్థులు రాజానగరం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు సమాచారం.
ఇవాళ ఉదయం ఇద్దరు విద్యార్థులు పరీక్ష హాల్లోకి ఎంటరయ్యారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అది ఘర్షణకు దారితీసింది. దీంతో సహనం కోల్పోయిన ఉదయ్ శంకర్ అనే విద్యార్థి.. తూర్పు గానుగూడెంకు చెందిన హరి సాయి అనే మరొక విద్యార్థిపై కత్తితో దాడి చేశాడు. ఊహించని ఘటనతో హరి సాయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో పడిపోయాడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు అప్రమత్తమై బాలుడిని రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన విద్యార్థి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు తెలుసుకుంటున్నారు.