సమాజంలో మోసపోయే వాళ్లు ఉంటే మోసం చేసేవాళ్లు ఎన్నో విధాలుగా మోసం చేస్తుంటారు. మోసం చేసే వాళ్లు ఏదో విధంగా జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తారు. వీరి మాటలను నమ్మకపోతే ఆ ప్రయత్నాన్ని వారు విరమిస్తారు. అదే పొరపాటున ఆ మాయగాళ్ల మాటలు నమ్మితే ఇక అంతే సంగతులు. దొరికిన కాడికి దోచుకుంటారు. అలాంటి ఘటన ఒకటి కర్నూలులో చోటుచేసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ వేసే పేరుతో ఓ మాయలేడి ఇంట్లోకి వచ్చి ఓ మహిళను క్షణాల్లో బురిడీ కొట్టించి బంగారు గొలుసుతో ఉడాయించింది.
వివరాల్లోకి వెళ్తే..శుక్రవారం కర్నూలులోని స్టాంటన్పురంలో కళావతమ్మ అనే మహిళ ఇంటికి ఓ గుర్తు తెలియని మహిళ వచ్చి కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు వచ్చానని మాటలు కలిపింది. చివరికి కళావతమ్మ ఆ మహిళ మాటలు నమ్మించింది. వ్యాక్సిన్ వేసే ముందుగా కళ్లలో తను తెచ్చిన మందు వేసుకోవాలని చెప్పి బాధితురాలిని నమ్మించింది.ఆ మహిళ మాటలు నమ్మిన బాధితురాలు కళ్లలో రెండు చుక్కలు వేయించుకుంది. చుక్కల మందు వేయటంతో కళ్లు మూసుకుంది.
ఇదే అదునుగా భావించి కళావతమ్మ మెడలోని 25 గ్రాముల బరువున్న బంగారు గొలుసును మాయలేడి తెంపుకుని ఉడాయించింది. బాధితురాలు తెరుకోని గట్టిగా కేకలు వేసుకుంటూ బయటకు వచ్చినా.. ఆలోపే ఆ మాయలేడి మాయమైపోయింది. దీంతో బాధితురాలు పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో ఇలాంటి నిత్యం చూస్తూనే ఉంటాం. అయిన గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి ఇలా కొందరు మోసపోవటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.