ఆ చిన్నారులు ఇద్దరూ వేసవి సెలవులను పెద్దమ్మ ఇంట్లో సరదాగా గడుపుదామని వచ్చారు. అయితే, వారి ఆశలు నెరవేరలేదు. పైగా కారు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.
వేసవి సెలవులు అంటే చిన్న పిల్లలకు చెప్పలేని ఆనందం. సెలవుల్లో అయినవాళ్ల ఊరెళ్లి సరదాగా గడపొచ్చని సంతోషపడతూ ఉంటారు. చాలా మంది అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళతారు. చిన్నమ్మ, పెద్దమ్మ, మేనమామల ఇంటికి వెళ్లి సెలవులను సరదాగా గడుపుతూ ఉంటారు. సరిగ్గా అలాగే ఈ స్టోరీలో కూడా ఓ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మతో కలిసి పెద్దమ్మ దగ్గరకు వెళ్లారు. వేసవి సెలవుల్లో సంతోషంగా గడపాలనుకున్నారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వారు కారు ప్రమాదంలో పెద్దమ్మతో పాటు మరణించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బలిజగూడలో షహజాదీ అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమె స్వస్థలం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం. ఆమె బలిజగూడ సమీపంలోని ఫామ్‌హౌస్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తోంది. కొద్దిరోజుల క్రితం షెహజాదీ పెద్ద చెల్లెలి కుమారుడు, చిన్నచెల్లెలి కుమార్తె వేసవి సెలవులు గడపటానికి ఆమె ఇంటికి వచ్చారు. మంగళవారం సాయంత్రం వేళలో పిల్లలిద్దరిని సరదాగా కాసేపు బయటికి తీసుకెళదామని అనుకుంది షెహజాదీ. ఇద్దరు పిల్లలను కారులో తీసుకొని పెద్ద అంబర్‌పేట్‌లోని ఓ బేకరీకి తీసుకెళ్లింది. తిరిగి వస్తుండగా టిప్పర్ లారీ వేగంగా వచ్చి వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.
కారుతోపాటు అందులో ఉన్న షహజాదీ, ఇద్దరు పిల్లలు కూడా ఎగిరి రోడ్డుపై పడ్డారు. వారి శరీరాలు రోడ్డుకు బలంగా తాకటంతో తీవ్రగాయాలయ్యాయి. షహజాదీతో పాటు బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే మృతి చెందింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.