మీరు మీ పిల్లల భవిష్యత్ గురుంచి ఆలోచిస్తున్నారా..? వారికి ఆర్థిక భద్రత కల్పించాలని చూస్తున్నారా? అయితే మీరు కచ్చితంగా చేయాల్సిన పని ఒక్కటే. వారి కోసం చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడమే. ప్రస్తుతం మార్కెట్‌లో పలు రకాల చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. వాటి ప్రయోజనాలు తెలుసుకొని మీకు నచ్చింది ఎంచుకోండి..
తల్లిదండ్రుల ఆశలన్నీ వారి పిల్లల భవిష్యత్తుపైనే. మరి చిన్నారుల బాల్యం, చదువులు భద్రంగా ఉండాలంటే రక్షణకు బీమా పాలసీలు కచ్చితంగా ఉండాల్సిందే. చైల్డ్ పాలసీలు పిల్లలకు మంచి విద్యను అందించడానికి, ఆర్థికంగా వివాహ లక్ష్యాలను చేరుకునేందుకు.. అనారోగ్యం బారిన పడినప్పుడు సహాయపడేందుకు.. ఇలా భిన్న రకాల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతానికి ఇంజనీరింగ్ చదివేందుకు రూ. 10 లక్షలు అవుతుంది అనుకుంటే మరో 20 సంవత్సరాల తర్వాత 5శాతం ద్రవ్యోల్బణంతో అది రూ. 25 లక్షలపైనే కావచ్చు. అంత మొత్తం ఒక్కసారిగా భరించాలంటే కొద్దిగా కష్టమైన పనే.
అదే పిల్లల పేరుపై ఎడ్యుకేషన్ బీమా పాలసీ ఉంటే, చదువు ఖర్చులకు డబ్బు రాబడితో పాటు కాలపరిమితి ఉన్నంత వరకూ పాలసీదారుకు బీమా సైతం లభిస్తుంది. అలాగే, ఉన్నట్టుండి పిల్లాడు అనారోగ్యం బారిన పడ్డాడు అనుకోండి. లక్షల మేర చెల్లించాల్సి రావచ్చు. చేతిలో అంత మొత్తంలో డబ్బు ఉండదు. ఎదుటివారిని అడిగితే సహాయ పడకపోవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే తల్లైదండ్రుల బాధలు వర్ణనాతీతం. అదే మీ పిల్లలపై హెల్త్ ఎడ్యుకేషన్ బీమా పాలసీ ఉంటే.. ఎలాంటి బెంగ అక్కర్లేదు. ఇలా భిన్న రకాలుగా చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటి ప్రయోజనాలు తెలుసుకొని మీకు నచ్చింది ఎంచుకోండి..
చైల్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జబ్బుపడిన లేదా గాయపడిన పిల్లలకు వైద్య చికిత్స ఖర్చును కవర్ చేసేందుకు రూపొందించబడినది. ఇది హాస్పిటలైజేసన్ ఖర్చులు మొదలు మందులు, సంబంధిత సేవల వంటి అన్ని ఖర్చులను కవర్ చేస్తుంది.
చైల్డ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ప్రమాద బీమా పాలసీ. ప్రమాదంలో అంగ వైకల్యం చెందినా లేదా మరణించినా ఆర్థికంగా రక్షణగా నిలిచే పాలసీ. ఇది వైద్య ఖర్చులు, పునరావాస ఖర్చులు, కోల్పోయిన ఆదాయాన్ని కవర్ చేస్తుంది.
పిల్లలకి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు ఖర్చులను కవర్ చేయడానికి ఈ క్రిటికల్ ఇల్‌నెస్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. ఏకమొత్తంలో డబ్బును అందజేస్తుంది. వైద్య ఖర్చులు, పునరావాసం, ఇతర ఖర్చుల కోసం ఈ డబ్బును ఉపయోగించవచ్చు.
చైల్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లతో కలిసి వస్తుంది. ఇందులో తక్కువ మొత్తంలో ప్రీమియంలు చెల్లిస్తూ ఉంటే.. పిల్లలు పెద్ద(మేజర్) వారైనప్పుడు విద్య లేదా వివాహం వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం ఏకమొత్తంలో డబ్బును అందజేస్తుంది.
ఇది పిల్లల చుదువులకు ఆర్థికంగా సాయపడేందుకు రూపొందించినది. పాలసీ పీరియడ్ ముగిసినప్పుడు పెద్ద మొత్తంలో నగదు చేతికి అందుతుంది. ఇది మీ పిల్లల విద్యా అవసరాలకు ఉపయోగపడుతుంది.