గత మూడు రోజులుగా బంగారం మళ్ళీ పుంజుకుంటుంది. వెండి కూడా 4 రోజులుగా భారీగా పెరుగుతూ వస్తుంది. మరి ఇటువంటి సమయంలో బంగారం, వెండి ఆభరణాలు కొనడం మంచిదేనా? ఇది తగిన సమయమేనా? ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి?
బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఎప్పుడు కొంటే మంచిదో ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే గత నెలలో తగ్గుతూ వచ్చిన బంగారం మే నెలలో ఒక్కసారిగా పుంజుకుంది. 60 వేల దగ్గర ఉండాల్సిన బంగారం సరాసరి 4 రోజుల్లో రూ. 62 వేలకు చేరుకుంది. మళ్ళీ ఈ ధరలు పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం పతనమయ్యింది. అయినా కూడా దేశీయంగా మాత్రం గణనీయంగా పెరుగుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారంపై డిమాండ్ ఎక్కువగా ఉంది. వేడుకలు ఉన్నవారు తప్పదు కాబట్టి కొనక తప్పదు. మిగతా వారు మాత్రం కొనే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే కొన్న రెండు, మూడు రోజులకే బంగారం తగ్గితే అరెరే అనవసరంగా తొందర పడ్డామే అని బాధపడాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఒక ఔన్సు వచ్చేసి 2,016 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధర అయితే 25.66 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు రెండూ ప్రతికూలంగానే ఉన్నాయి. దేశీయంగా మాత్రం వీటి డిమాండ్ అనేది బాగా పెరిగింది. గత నెల రోజులుగా బంగారం ధరలు పరిశీలిస్తే.. ఏప్రిల్ 6న 22 క్యారెట్ల బంగారం రూ. 55,900 ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 60,980 ఉంది. ఏప్రిల్ 14న 22 క్యారెట్ల బంగారం రూ. 56,500 అవ్వగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 61,800కి చేరుకుంది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, పెరుగుతూ వచ్చిన బంగారం.. మే నెల వచ్చేసరికి ప్రతాపం చూపించడం మొదలెట్టింది. ఈ మూడు రోజుల్లోనే 10 గ్రాముల వద్ద ఏకంగా రూ. 1500 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఐతే రూ. 1640 పెరిగింది.
మే 1న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 55,700 ఉండగా.. 3, 4, 5వ తేదీల్లో రూ. 1500 పెరిగింది. మే 3న రూ. 800 పెరగగా, 4న రూ. 500, 5న రూ. 200 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 57,200 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. మే 1న రూ. 60,760 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం మూడు రోజుల్లో భారీగా పెరిగింది. మే 3న రూ. 880 పెరగగా, 4, 5 తేదీల్లో ఏకంగా రూ. 760 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 62,400కి చేరుకుంది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగిపోతుంది. మే 1న 80,200 వద్ద కొనసాగిన కిలో వెండి మే 2న రూ. 300 పెరుగుదలతో రూ. 80,500కి చేరుకుంది. మే 3న రూ. 1300, 4న రూ. 1000, 5న రూ. 900 పెరిగాయి. 4 రోజుల్లో ఏకంగా రూ. 3,500 పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 83,700కి వద్ద కొనసాగుతోంది.
గత నెల 14న రూ. 83 వేల మార్కుని టచ్ చేసిన వెండి.. ఆ తర్వాత 81 వేలు, 82 వేలు, 80 వేలు ఇలా కొనసాగుతూ వచ్చింది. భారీగా పెరిగిన మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొనడం కంటే రూ. 81 వేలకు చేరుకున్నాక కొనడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇక బంగారం కొనేవారు కూడా పెరిగినప్పుడు కంటే తగ్గినప్పుడు కొనడం మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రూ. 62,400 వద్ద కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగింది. చూస్తుంటే రూ. 63 వేల మార్కుని చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎంత పెరిగినా మళ్ళీ తగ్గడం అనేది మామూలే అని అంటున్నారు. తగ్గితే గనుక రూ. 61 వేలకు చేరుకునే అవకాశం ఉంటుందని.. అప్పుడు కొనడం మంచిదని సూచిస్తున్నారు. కానీ మూడు రోజులకు ముందు బంగారం, వెండి కొన్నవారికి మాత్రం భారీ లాభమనే చెప్పాలి. అందుకే తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కోవడం మంచిది.