ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంటోంది. పారితోషికం విషయంలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఒకవైపు సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తూ పొదుపు చర్యలు చేపడుతున్న తరుణంలోనే ఆయన ఏకంగా 226 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో సుమారుగా రూ.1,854 కోట్లు) పారితోషికం అందుకున్నారనే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. సుందర్ పిచాయ్ తీసుకున్న పారితోషికానికి సంబంధించిన వివరాలను ఆల్ఫాబెట్.. స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు వెల్లడించింది. ఆయన అందుకున్న పారితోషికంలో 218 మిలియన్ డాలర్లు విలువైన స్టాక్ అవార్డ్స్ ఉన్నట్లు ఆల్ఫాబెట్ తెలిపింది. గత సంవత్సరం పిచాయ్ పారితోషికం గూగుల్ సగటు ఉద్యోగి వేతనం కంటే 800 రెట్లు ఎక్కువగా ఉండటం సంచలనంగా మారింది.
పొదుపు చర్యలు పేరిట వేలాది మంది ఎంప్లాయీస్‌కు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో సుందర్ పిచాయ్ ఈ స్థాయిలో వేతనం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ నెల మొదట్లో లండన్‌లోని గూగుల్ ఉద్యోగులు లేఆఫ్స్‌కు నిరసనగా వాకౌట్ చేశారు. అంతకుముందు, జ్యూరిచ్‌లో 200 మంది ఎంప్లాయీస్‌ను తొలగించడం మీద ఇతర ఉద్యోగులు నిరసన చేపట్టారు. మొత్తంగా 12 వేల మంది ఎంప్లాయీస్‌ను తీసేయనున్నట్లు గూగుల్ ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన విషయం విదితమే. ఆర్థిక మాంద్యం భయాలు, ఫైనాన్షియల్‌గా గడ్డు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తొలగింపులు తప్పవని గూగుల్ కంపెనీ అప్పట్లో వెల్లడించింది.