పెన్షన్ ఉంటే వృద్ధాప్యంలో ఉండదు ఏ టెన్షన్. వృద్ధులకు పెన్షన్ అనేది చాలా అవసరం. కొడుకులు చూస్తారో లేదో, కూతుర్లకు చూసే అవకాశం ఉంటుందో లేదో, అసలు చూద్దామన్నా చూసే ఆర్ధిక స్థోమత పిల్లలకి ఉంటుందో లేదో? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరి మీద ఆధారపడకుండా ఉండాలంటే పెన్షన్ చాలా ముఖ్యం. పట్టుదల ఉన్నా ఒంట్లో పట్టు ఉండని ఏజ్ అది. ఆ ఏజ్ లో సాధించాల్సింది పిల్లల్ని కాదు, అటల్ పెన్షన్ యోజన పథకాన్ని. ఆ ఏజ్ లో పడాల్సింది టెన్షన్ కాదు, మీ ఖాతాల్లో పెన్షన్. మరి టెన్షన్ లేకుండా పెన్షన్ పొందాలంటే ఏం చేయాలి? ఈ పెన్షన్ పథకానికి ఎలా అప్లై చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వృద్ధులకు ప్రభుత్వాలు ఎలాగూ నెలకి 2 వేలో, 3 వేలో ఇస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకో రూ. 5 వేలు రావాలంటే మాత్రం ‘అటల్ పెన్షన్ యోజన’ పథకంలో చేరాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత ఒకరి మీద ఆధారపడకుండా ఉండేందుకు ప్రజలకు సామాజిక భద్రత కల్పించే పథకమే ఈ ‘అటల్ పెన్షన్ యోజన పథకం’. ఈ పథకంలో ఎవరైనా చేరచ్చు. ఈ పథకంలో చేరిన తర్వాత నెల, 3, 6 నెలలకొకసారి డబ్బులను పెట్టుబడిగా పెట్టాలి. అలా 60 ఏళ్లు వచ్చే వరకూ పెట్టుకుంటూ వెళ్తే.. ఆ తర్వాత నెలకి పెట్టుబడి పెట్టిన సొమ్ము బట్టి రూ. వెయ్యి నుంచి రూ. 5 వేలు పెన్షన్ వస్తుంది.
ఖాతా తెరవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ పథకంలో కనీసం రూ. 42 నుంచి పెట్టుబడి పెట్టచ్చు. రూ. 42 రూపాయలు పెట్టుబడి పెడితే.. 60 ఏళ్ల తర్వాత నెలకి రూ. వెయ్యి పెన్షన్ పొందవచ్చు. అంతకంటే ఎక్కువ పెన్షన్ కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. ఇలా కనీసం 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెడుతూ వెళ్ళాలి. మీరు చెల్లించే దాని బట్టి నెలకి రూ. 1000 నుంచి రూ. 5 వేల వరకూ గ్యారంటీగా పెన్షన్ ఉంటుంది. ఈ ఖాతా తెరిచే ముందు మీ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉండాలి.