భారతీయ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సామాన్యులకు ఉపశమనం కలిగించే దిశగా అడుగులు వేస్తోంది. బ్యాంక్ ఖాతాల్లో డబ్బు నిల్వలేనప్పుడు.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద బ్యాంకులు ప్రస్తుతం విధిస్తున్న చార్జీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఈరోజుల్లో బ్యాంకు ఖాతా లేని వారు అన్నది చాలా అరుదు. బడికెళ్లే పిల్లలు మొదలు వయసు మళ్లిన పెద్దల వరకు అందరికీ బ్యాంకు అకౌంట్లు ఉంటున్నాయి. పిల్లలు.. పొదుపు, స్కాలర్ షిప్ వంటి ఆవరసరాలకై బ్యాంకు ఖాతా తెరుస్తుంటే, ఉద్యోగులు.. జీతాల కోసం, పెద్దలు.. పింఛన్ల కోసం, మరికొందరు.. ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కోసం బ్యాంకు అకౌంట్లు వినియోగిస్తున్నారు. అదే సమయంలో వ్యాపారాలు చేసే వారికైతే రెండు, మూడు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, బ్యాంక్ ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలన్నది సామాన్యులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. దీనికి పరిష్కారం చూపేందుకు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
బ్యాంక్ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్ లేకుంటే బ్యాంకులు ఫైన్ విధిసాయన్న విషయం అందరికీ విదితమే. దీనినే ‘మినిమం బ్యాలెన్స్’ అంటారు. కొన్ని బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ వెయ్యి రూపాయలుగా ఉండగా.. మరికొన్నింటిలో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఉంటోంది. ఇక ప్రైవేట్ బ్యాంకుల్లో అయితే రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ ఉంటోంది. ఇంత మొత్తంలో ఖాతాలో బ్యాలన్స్ నిల్వ ఉంచడమన్నది నెల రూ.30వేల జీతం పొందే ఉద్యోగికి కూడా సాధ్యపడదు. గృహావసరాలు, పెరుగుతోన్న ఖర్చులు సామాన్యుడికి కష్టంగా మారాయి. ఇలాంటి సమయంలో ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ ఉండాలన్నది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. ఖాతాల్లో అత్యవసరాలకై ఉంచిన డబ్బును కూడా ‘మినిమం బ్యాలన్స్’ చార్జీల పేరిట బ్యాంకు యాజమాన్యాలు కట్ చేస్తున్నాయి. అంతేకాదు ఇతర అవసరాల కోసం డబ్బులు వేసినా.. అందులో నుంచి ఛార్జీలు కట్ చేస్తున్నారు.
ఈ సమస్యలపై ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సేవింగ్ ఖాతాల్లో సున్నా బ్యాలెన్స్ ఉన్నా.. మినిమం బ్యాలెన్స్ మెయింటెనెన్స్ కింద ప్రస్తుతం విధిస్తున్న చార్జీలను నిలిపివేయాలని బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రముఖ ప్రవేట్ బ్యాంక్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ మినిమం బ్యాలెన్స్ మెయింటెన్స్ చేయకపోయినా ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ప్రకటించినాట్లు వార్తలొస్తున్నాయి. మరో దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కూడా అదే దారిలో వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని ప్రభుత్వ బ్యాంకులు సైతం ఇదే ఆలోచనలో ఉన్నాయని సమాచారం. ఏదేమైనా ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్యులకు ఊరటనిచ్చేదే. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.