అక్షయ తృతీయ పండుగకు, హిందువులకు అపారమైన అనుబంధం ఉంది. ఈ పండుగ రోజున ఏవైనా పెట్టుబడులు అంటే విలువైన వస్తువులు కొనుగోలు చేస్తే సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. ముఖ్యంగా బంగారం కొనుగోలు చేస్తే చాలా మంచిదని భావిస్తారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని అనుకోవడానికి కారణం ఏమిటి? అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి?
అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ప్రతి ఏటా అక్షయ తృతీయ వచ్చిందంటే హిందువులు పెద్ద ఎత్తున బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. లేనోళ్ళు, ఉన్నోళ్లు, నలిగిపోయినోళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా బంగారం కొనాలని ప్రయత్నిస్తుంటారు. ఈరోజున బంగారం మీద ప్రత్యేకమైన డిస్కౌంట్లు కూడా ఉంటాయి. అంతలా అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలి అనుకోవడం వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది అక్షయ తృతీయ అనే పేరు. ఈ పేరులోనే ఉంది అసలైన అద్భుతమంతా. అక్షయ అంటే క్షయం లేనిది అని అర్థం. అంటే ఎన్నటికీ తరగనిది, చిరకాలం ఉండేది అని అర్థం. సంస్కృతం ప్రకారం అక్షయ అంటే శ్రేయస్సు, ఆనందం, విజయం అని అర్థం. తృతీయ అంటే వైశాఖ మాసంలో మూడవ రోజు అని, చంద్రుని మూడవ దశ అని అర్థం.
ఈరోజున ఏ కార్యం తలపెట్టినా అది విజయవంతం అవుతుందని, ఎన్నటికీ నిలిచిపోతుందని నమ్ముతారు. అందుకే ఇవాళ విలువైన వస్తువులు, ముఖ్యంగా బంగారం కొంటూ ఉంటారు. కొంతమంది ఈరోజున వ్యాపారాలు ప్రారంభిస్తారు. అలానే మరొక నమ్మకం కూడా ఉంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు ఈరోజే. బంగారాన్ని మించిన సంపద మరొకటి లేదని అంటూ ఉంటారు. అందుకే అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే కుబేరుడు తమ సంపదను రక్షిస్తాడని నమ్ముతారు. మహాలక్ష్మి అమ్మవారిని శ్రీవిష్ణువు వివాహం చేసుకున్న రోజు కూడా ఈరోజే. క్షీరసాగర మధనం తర్వాత విష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నారు. ఈరోజున లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు.
అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేది. ప్రజలు సౌభాగ్యాలతో బతికిన యుగం అది. అలాంటి యుగం మొదలైన అక్షయ తృతీయ రోజు శుభదినంగా భావిస్తారు. నిరుపేద అయినటువంటి కుచేలుడు తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షంతో అక్షయ సంపదలను పొందిన రోజు ఈరోజు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు ఈరోజు. కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాల ప్రస్తావన ఉండదు. బంగారం సహా ఏవి కొనుగోలు చేసినా సమయం చూసుకోనవసరం లేదు. ఏ సమయంలో అయినా కొనుగోలు చేయవచ్చు. ప్రతి క్షణమూ సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభం చేకూరుతుంది. ఈరోజున అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు.
ఇన్ని కారణాలు ఉండబట్టే.. ఇన్ని ప్రత్యేకతలు ఉండబట్టే అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇక బంగారమే ఎందుకు కొనుగోలు చేస్తారంటే.. దీని విలువ అనేది ఏళ్ల తరబడి అలానే ఉంటుంది. భద్రత కోసం బంగారాన్ని ప్రత్యామ్న్యాయం గా భావిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేసేది ఈ బంగారమే. పిల్లల్ని చదివించడానికి ఉపయోగపడేది ఈ బంగారమే. ఎంతోమంది వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమవ్వడానికి కారణం కూడా ఈ బంగారమే. బంగారం ఆపదలో ఆదుకునే ఆపద్భాంధవుడు అని నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ నాడు మిగతా వస్తువుల కంటే బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు.