డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, పాస్ బుక్, ఏటీఎం విత్ డ్రా ఛార్జీలు, మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయకపోతే ఛార్జీలు ఇలా రకరకాల ఛార్జీల పేరుతో బ్యాంకులు ఖాతాదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. అయితే తాజాగా మరొక కొత్త రకం ఛార్జీ ఖాతాదారుల మీద పడనుంది. ఏటీఎంలో ఈ తప్పు చేస్తే కనుక ఖాతాదారుల నుంచి పెనాల్టీ వసూలు చేయడం జరుగుతుంది.
చదువుకున్నవారు ఐతే స్మార్ట్ ఫోన్ లో తమ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో అనేది చెక్ చేసుకుంటారు. అయితే అందరూ చదువుకున్న వారు ఉండరు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండదు కాబట్టి ఏటీఎంకి వెళ్లి బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకుంటారు. కొన్ని సందర్భాల్లో బ్యాలెన్స్ ఉందేమో అనుకుని డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఇక నుంచి ఇలా చేస్తే ఛార్జీల మోత తప్పదు. ఏటీఎంలో జరిపే లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు తాజాగా కీలక ప్రకటన చేసింది. ఖాతాలో డబ్బు లేకపోయినా.. కొందరు బ్యాలెన్స్ చెకింగ్ చేసుకోవడం, నగదు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఇక నుంచి ఇలా చేస్తే ఛార్జీలు విధిస్తామని పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది.
ఖాతాలో డబ్బులు ఉంటేనే విత్ డ్రా చేసుకోవాలని బ్యాంకు తెలిపింది. ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పుడు ఏటీఎంలో నగదు విత్ డ్రాకు ప్రయత్నించినప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అని వస్తుంది. అలా వస్తే గనుక ఖాతాదారుల నుంచి రూ. 10 + జీఎస్టీ వసూలు చేయడం జరుగుతుందని బ్యాంకు తెలిపింది. మే 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుందని పేర్కొంది. అంతేకాదు ఫెయిలైన ఏటీఎం లావాదేవీలకు సంబంధించి ఫెయిల్యూర్స్ పై ఇచ్చిన ఫిర్యాదులను 7 రోజుల్లో పరిష్కరిస్తామని బ్యాంకు తెలిపింది. లావాదేవీలు జరిగిన తేదీ నుంచి 30 రోజుల్లోపు క్లెయిమ్ చేసిన ఖాతాదారుడికి పరిష్కారం ఇవ్వడంలో ఆలస్యమైతే ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజులూ రోజుకు రూ. 100 చొప్పున పరిహారం ఇవ్వనుంది.
లావాదేవీలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులకైనా, సమస్యల పరిష్కారానికైనా టోల్ ఫ్రీ నంబర్లు 0120-249 0000 లేదా 1800 180 2222, 1800 103 2222 కు కాల్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంకు తెలిపింది. మరోవైపు బ్యాంకు డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు ఇస్స్యూరెన్స్ చార్జీలు, వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా సవరించే యోచనలో ఉన్నట్లు బ్యాంకు తెలిపింది. అంతేకాదు బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ లేని సమయంలో డెబిట్ కార్డుతో పీఓఎస్, ఈ కామ్ లావాదేవీలపై కూడా ఛార్జీలు వసూలు చేసే ఆలోచనలో బ్యాంకు ఉన్నట్లు పేర్కొంది. మరి ఈ సరికొత్త నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.