మనలో కోటీశ్వరులు కావాలని భావించే వాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఎవరి వద్ద అందుకు తగ్గ ప్రణాలికలు ఉండవు.. కలలు మాత్రం కంటుంటారు. అందరూ గుర్తుంచుకోండి.. ఒక్కనెలలోనో, ఒక్క ఏడాదిలోనో కోటీశ్వరులు అవ్వడం అసాధ్యం. అందుకున్న ఏకైక సురక్షిత మార్గం.. 'పొదుపు'. నెలనెలా కొంత మొత్తంలో పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్ళకు కోటి రాబడిని నిజంగానే పొందవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
భవిష్యత్.. భవిష్యత్.. అందరూ ఆలోచనలు దీని గురుంచే. రేపొద్దున ఏ అవసరమొస్తుందో.. ఎలాంటి కష్టాలు మనల్ని ధరిచేరుతాయో.. ఆ సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఆర్థికంగా స్థిరపడి ఉండాలి. అలా ఆర్థికంగా ఉన్నతంగా స్థిరపడాలంటే.. మన ముందున్న ఏకైక సురక్షిత మార్గం.. ‘పొదుపు’. మీకు పొదుపు చేయాలనుకుంటే.. మిమ్మల్ని ధనవంతులను చేసే అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీమ్ కూడా అచ్చం అలాంటిదేనని చెప్పుకోవాలి. ఈ స్కీమ్ లో దీర్ఘకాలం పొదుపు చేస్తే.. పెద్ద మొత్తంలో రాబడి పొందవచ్చు. పైగా ఇందులో మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ఇది మార్కెట్ హెచ్చుతగ్గుల ద్వారా అస్సలు ప్రభావితం కాదు.
ప్రస్తుతమున్న సురక్షిత పెట్టుబడి పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అతి ముఖ్యమైనది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడుల పథకం. పీపీఎఫ్ ఖాతాను 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఏదేని బ్యాంకు లేదా పోస్టాఫీసులో తెరవచ్చు. ఖాతా తెరవడానికి గరిష్ట వయో పరిమితి అంటూ లేదు. కాకుంటే.. ఒక వ్యక్తి ఒక ఖాతానే తెరవాల్సి ఉంటుంది. కనీసం రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా ఖాతా తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఏడాదికి రూ. 500 అయినా డిపాజిట్ లేదా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేయవచ్చు. ఈ ప్రభుత్వ పథకం యొక్క లాక్ ఇన్ ఫైరియడ్ 15 ఏళ్లు. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై 7.10 శాతం వార్షిక వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి ఈ వడ్డీ రేట్లను సమీక్షిస్తారు.
ఈ పథకం ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వాలనుకుంటే.. మెచ్యూరిటీ కాలవ్యవధి(15 సంవత్సరాల) తర్వాత స్కీమ్ ను 5 సంవత్సరాల కాలానికి మరో రెండు సార్లు పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. మీ లాక్ ఇన్ పిరియడ్ ని 25 ఏళ్లకు పెంచుకోవాలన్నమాట. ఉదాహరణకు.. మీరు రోజుకు రూ. 417 లేదా నెలకు రూ.12,500 చొప్పున 15 ఏళ్లపాటు పొదుపు చేశారనుకోండి.. మెచ్యూరిటీపై మొత్తం రూ.40.68 లక్షలు పొందుతారు. ఇప్పుడు మెచ్యూరిటీ కాలవ్యవధిని మరో రెండు సార్లు5 సంవత్సరాల కాలానికి పెంచుకుంటే.. 25 సంవత్సరాల తర్వాత మీ మొత్తం కార్పస్ రూ. 1.03 కోట్లు అవుతుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 37.50 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ. 65.58 లక్షలు మీకు అందుతుంది.
ఈ లెక్కన ఒక వ్యక్తి తాను 30 సంవత్సరాల వయస్సులో ఈ పథకాన్ని ప్రారంభిస్తే.. అతడు రిటైర్మెంట్(55) అయ్యే నాటికి కోటి రూపాయలు అతని చేతికి అందుతాయని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ సూచిస్తున్నారు. పైగా ఈ పథకంలో ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. పీపీఎఫ్ ఖాతాను పొడిగించాలనుకుంటే, మెచ్యూరిటీకి ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత ఖాతా పొడిగించటం కుదరదు.
గమనిక: వడ్డీ రేట్ల మార్పులకు అనుగుణంగా రాబడి మొత్తం ఉంటుంది. గుర్తుంచుకోగలరు.