దాదాపు 30 కోట్ల మంది పాలసీదారులు, లక్షకు పైగా ఉద్యోగులు, ఏజెంట్లు.. ఇలా దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థగా ఉన్న ఎల్ఐసీలో ప్రభుత్వం పెట్టిన మూలధన పెట్టుబడి ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.5 కోట్లు! ఆ తర్వాత వివిధ దపాల్లో పెట్టిన మొత్తం కూడా రూ.100 కోట్లే. కానీ ఇవాళ అదే కంపెనీ ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికి డివిడెండ్ గా చెల్లించింది. ఇప్పుడు ఐపీఓ ద్వారా వేల కోట్లు ఇవ్వబోతోంది. ఈ సమయంలో ఎల్ఐసీ ఐపీవో గురుంచి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ సందడి రానే వచ్చింది. మే 4 నుంచి 9 వరకు ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న ఎల్ఐసీ షేర్లు లిస్టింగ్ కానున్నాయి. కేవలం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 వేల కోట్లను ప్రభుత్వం సమీకరించనుంది. ఐపీవోలో షేర్ల ధరను రూ.902-949గా నిర్ణయించారు. ఎల్‌ఐసీ పాలసీదారులకు 10 శాతం షేర్లను, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం షేర్లను రిజర్వ్ చేశారు. ఉద్యోగుల కోసం 0.71 శాతం షేర్లను సిద్ధం చేయగా, దేశీయంగా ఇప్పటిదాకా వచ్చిన ఐపీవోల్లో ఇదే పెద్దది.
ఎల్ఐసీ ఐపీవో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
ఇన్వెస్టర్లు మినహా మిగతావారు తప్పనిసరిగా ఏఎస్‌బీఏ పద్ధతితోనే పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. బిడ్ కమ్ అప్లికేషన్ ద్వారా సెల్ఫ్ సర్టిఫైడ్ సిండికేట్ బ్యాంక్‌తో ఐపీవో దరఖాస్తుకు అవసరమైన మొత్తాన్ని బ్లాక్ చేస్తారు. బ్యాంక్ నుంచి దరఖాస్తు సొమ్ము అలాట్‌మెంట్ పూర్తయిన తర్వాత మినహాయించుకుంటారు. అలాగే.. యూపీఐ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే యూపీఐలో మీ డీపాజిటరీ ఐడీ, క్లయింట్ ఐడీ, యూపీఐ ఐడీ, పాన్ నెంబర్లు.. ఇలా అన్ని వివరాలు పక్కాగా లేకపోతే తిరస్కరిస్తారు. మరొకరి యూపీఐ ఐడీ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలనూ పొందుపరచడానికి వీల్లేదు.