ఒకవేళ బంగారం కనుక ఈఎంఐలలో దొరికితే.. జనాలు ఎలక్ట్రానిక్స్, వాహనాలు వంటివి కొనుగోలు చేసే బదులు.. పసిడి కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. ఇక ఫలానా ప్రాంతంలో బంగారం ధర తక్కువ అంటే అక్కడికి క్యూ కడతారు. ఇక మన హైదరాబాద్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో బంగారం తక్కువ ధరకే లభిస్తుంది. ఎక్కడంటే..
బంగారం-భారతీయ మహిళలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. ప్రతి మహిళ.. తన జీవిత కాలంలో ఎంతో కొంత బంగారం కొనాలనుకుంటుంది. పైగా ఎంత ఉన్నా సరే బంగారం మీద మోజు మాత్రం తగ్గదు. ఇక వివాహాది శుభకార్యాల వేళ.. బంగారం కొనుగోలు తప్పని సరి. ఎంత పేదవాళ్లైనా సరే.. చేతనైన కాడికి బంగారం కొనుగోలు చేయాలని చూస్తారు. ఇక పండుగ సందర్భాల్లో కూడా చాలా మంది మహిళలు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. పసిడి కొనుగోళ్ల విషయంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. అయితే మనం బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం. కనుక మన దగ్గర పుత్తడి ధర.. ఎక్కువగా ఉంటుంది.
ఇక గత కొని రోజులుగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. 24 క్యారెట్ బంగారం తులం ధర ఏకంగా 60 వేలకు చేరుకుంది. 22 క్యారెట్ బంగారం పది గ్రాముల ధర 55 వేలకు చేరుకుంది. దాంతో పసిడి ప్రియులు బంగారం కొనాలంటే ఆలోచిస్తున్నారు. మరి బంగారం తక్కువ ధరకు దొరికే ప్రాంతాలే లేవా అంటే.. ఉన్నాయి. మన హైదరాబాద్‌లోనే అతి తక్కువ ధరకే.. నాణ్యమైన బంగారం లభిస్తుంది. మరి ఆ ప్రాంతాలు ఏవి అంటే..
దేశంలోనే బంగారం అత్యధికంగా కొనుగోలు చేసే నగరాల్లో హైదరాబాదు ముందు వరుసలో ఉంటుంది. భాగ్యనగరంలో తయారు చేసే నగలకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉంది. నిజాం కాలం నుంచి కూడా హైదరాబాదు స్వర్ణకారులకు మంచి పేరుంది. ఒకప్పుడు హైదరాబాద్ స్వర్ణకారులను ఢిల్లీ పిలిపించుకొని మరి నగలు తయారు చేయించుకునేవారు అంటే.. వారి ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో సుమారు 150 సంవత్సరాలుగా నమ్మకంగా వ్యాపారం చేస్తున్న అనేక నగల దుకాణాలు ఉన్నాయి. నాణ్యతకు, మన్నికకు, డిజైన్లకు ఈ షాపులు పెట్టింది పేరు. పైగా పెద్ద పెద్ద జ్యూవేలరీ స్టోర్స్‌తో పోల్చితే ఇక్కడ ధర కూడా తక్కువగానే ఉంటుంది.
రాజుల కాలం నుంచి కూడా భాగ్యనగరం అమితమైన సంపదకు పెట్టింది పేరు. బంగారు ఆభరణాల తయారికి భాగ్యనగరం పేరు గాంచింది. మరీ ముఖ్యంగా నగరంలోని అబిడ్స్ ప్రాంతం.. వందల ఏళ్లుగా బంగారు నగల తయారీ, అమ్మాకలకు ప్రఖ్యాతి గాంచింది. నిజాం ప్రభువుల కాలం నుంచి అబిడ్స్ ప్రాంతంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు జోరుగా సాగేవి. అలాగే బషీర్‌బాగ్ ప్రాంతం కూడా బంగారు నగలకు చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కూడా నాణ్యమైన బంగారం లభిస్తుంది. వీటితో పాటు సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్ సమీపంలోని బంగారు దుకాణాల్లో మంచి నాణ్యమైన బంగారం లభిస్తుందనే పేరు ఉంది. మాల్స్‌తో పోల్చితే ఇక్కడ మజూరి, వ్యాట్ వంటి విషయాల్లో చాలా తేడా ఉంటుంది.
బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాల్సిన సమయంలో ముఖ్యంగా చూడాల్సింది నాణ్యత గురించి. ఆభరణాల రూపంలో మనం 22 క్యారెట్ల బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేస్తాం. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారంతో నగలను తయారు చేయలేరు. అందుకే 22 క్యారెట్ల బంగారం ధర పూర్తి మేలిమి బంగారం ధర కన్నా కూడా తక్కువగా ఉంటుంది. అయితే కొందరు 18 క్యారెట్ల బంగారంతో కూడా నగలు తయారు చేస్తారు. ఇది కొంచెం క్వాలిటీ తక్కువ అలానే ధర కూడా తక్కువగానే ఉంటుంది. కొన్ని నగల దుకాణాల వారు 18 క్యారెట్ల బంగారంతో నగలు తయారు చేసి 22 క్యారెట్ల బంగారంతో తయారు చేశామని మనల్ని నమ్మిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే భారీగా మోసపోవాల్సి వస్తుంది.
ఇవే కాక బంగారు నగలను కొనుగోలు చేసినప్పుడు తరుగు మజూరీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతర షాపులతో పోల్చి చూసుకుని.. ఆ తర్వాత కొనుగోలు చేయాలి. నిజానికి బంగారు ఆభరణాలకు సంబంధించి తరుగు అనేది చట్టబద్ధమైనది కాదు. కానీ బంగారు దుకాణాల వారు తరుగు పేరిట ఎక్స్‌ట్రా చార్జీ వసూలు చేస్తూ ఉంటారు. అలానే బంగారు నగలు కొనడానికి షాప్‌కు వెళ్లడానికి ముందే మీరు నాణ్యత విషయంలో అమల్లో ఉన్న నిబంధనలను తెలుసుకోండి. బీఐఎస్ హాల్ మార్క్ ఉన్న నగలను మాత్రమే కొనుగోలు చేయండి.