అప్పు.. ప్రతి మనిషి జీవితంలో ఇది ఏదొక సమయంలో భాగం అవుతుంది. కోట్లు ఉన్న ఉన్న వ్యక్తి కూడా ఎప్పుడో ఒకసారి దీనిని పలకరించాల్సిందే. అప్పు చేయడం చేతకాని వాడు గాడిద అనే సామెతలు కూడా ఉన్నాయి. గతంలో అయితే బయట ఎవరో ఒక వ్యక్తిని పట్టుకుని అతనికి రూ.2 నుంచి రూ.3 వరకు వడ్డీలు కట్టి రుణాలు తీసుకునేవాళ్లు. కానీ, ప్రస్తుతం రోజులు మారాయి. లోన్ల కోసం బ్యాకులు, ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ బ్యాంకులు, లోన్ యాప్స్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు నెలవారీ రుణ వాయిదాలు ఉంటాయి. అంటే వాటిని నెలకు ఇంత అని చెల్లించాలి. వాటిని ఈఎంఐలు అంటారు.
ఈ ఈఎంఐలు మీరు ఎలా చెల్లిస్తున్నారు అనే దానిపై మీ క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. మీ లావాదేవీలు, సిబిల్ స్కోర్ ఆధారంగానే మీకు భవిష్యత్ లో రుణాలు ఇవ్వడం చేస్తుంటారు. మీరు కట్టాల్సిన సమయంలో ఈ ఈఎంఐలను చెల్లించకపోతే మీ సిబిల్ స్కోర్, మీ ఆర్థిక లావాదేవీలపై దాని ప్రభావం పడుతుంది. కాబట్టి లోన్ తీసుకునే సమయంలో, ఈఎంఐగా మార్చుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ ఉద్యోగం పోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా కూడా మీరు ఈఎంఐలు కట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీకు నోటీసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
మీరు తీసుకున్న రుణానికి వరుసగా 3 నెలల పాటు వాయిదాని చెల్లించకపోతే మీ ఖాతాని తాత్కాలిక మొండి బకాయిగా పరిగణిస్తారు. అలా జరిగితే మీకు సదరు సంస్థకు చెందిన వ్యక్తులు నోటీసులు కూడా పంపిస్తారు. అంతేకాకుండా మీరు అన్ని నెలలు పెండింగ్ పెట్టినందుకు ఈఎంఐ మొత్తంపై 1 నుంచి 2 శాతం ఫైన్ కూడా విధించే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆ ప్రభావం మీ సిబిల్ స్కోర్ పై పడుతుంది. తర్వాత మీరు ఏదైనా రుణం తీసుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. దాదాపుగా చాలా సంస్థలు లోన్ ఇచ్చేందుకు నిరాకరించవచ్చు కూడా.
అయితే అలాంటి ప్రమాదం రాకుండా ఉండేందుకు.. తాత్కాలిక అవసరాల కోసం ఫిక్స్ డ్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలపై ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవచ్చు. ఆ రెండు, మూడు నెలల ఇబ్బంది తీరిన తర్వాత వీటిని కూడా త్వరగా చెల్లించాలి. ఒకవేళ పరిస్థితి సద్దుమణిగే పరిస్థితి లేకపోతే ముందుగా తక్కువ ఇంట్రస్ట్ వచ్చే ఇన్వెస్ట్ మెంట్ లను విత్ డ్రా చేసుకోవాలి. కొన్ని నెలల కోసం గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే లోన్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. మీరు కొన్నాళ్లు లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఇవి మిమ్మల్ని ఆదుకుంటాయి.
అయితే ఆర్థిక నిపుణల సలహా ప్రకారం మొత్తం 6 నెలలకు సరిపడా ఈఎంఐ మొత్తం మీరు సేవ్ చేసుకోవాలని చెబుతున్నారు. మీరు తీసుకునే లోన్ ఈఎంఐ మీ ఆదాయంలో 40 శాతానికి మించి ఉండకూడదని చెబుతున్నారు. అయితే తక్కువ జీతం వచ్చే వ్యక్తులు అసలు లోన్ మనం తీసుకోవడం అవసరమా? తీసుకుంటే తిరిగి కట్టగలమా? అనే విషయాలను పరిశీలించుకోవాలి. అలాగే మీకు ఖర్చులపై పట్టు ఉండాలి. ఒక రూపాయి ఖర్చు చేసే సమయంలో అసలు అది అవసరమా? అనే ప్రశ్న రావాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఖర్చులను కట్టడి చేయగలిగితేనే పరిస్థితులు మెరుగుపడతాయని చెబుతున్నారు.