తమకంటూ ఓ సొంతిళ్లు ఉండాలన్నది ప్రతీ వారి కల. ఇందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే, ఇళ్లు కట్టడం లేదా కొనడం అన్నది అంత వీజీ విషయం కాదు. చాలా డబ్బు, శ్రమతో కూడుకున్నది. అందుకే కొంతమంది కలలతోనే బతికేస్తుంటారు. మరికొంతమంది అనుకున్నదాన్ని కష్టపడి సాధించుకుంటారు. ఒక వేళ ఇళ్లు కట్టుకున్నా కూడా అది ఎన్ని సంవత్సరాలు బాగా ఉంటుందో చెప్పలేం. సరైన విధంగా జాగ్రత్తలు తీసుకోకపోతే ఆనతి కాలంలోనే రిపేర్లు వచ్చి ఇళ్లు పాడైపోతుంది. ఇక, అలాంటి ఇంటిని సరసమైన ధరకు అమ్మి కొత్త ఇళ్లు కొనుక్కునే ఆఫర్ వస్తే ఎలా ఉంటుంది?
అది కూడా మహా నగరాల్లో అయితే.. అదిరిపోతుంది కదూ. ఇక, ఈ అదిరిపోయే ఆఫర్‌ను కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ హౌసింగ్ ఇండస్ట్రీలు సంయుక్తంగా ప్రకంటించాయి. దాదాపు 100 రియలెస్టేట్ కంపెనీలు 30వ CREDAI-MCH ప్రాపర్టీ ఎగ్జిబిషన్‌లో భాగమయ్యాయి. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 13 వ తేదీనుంచి 16వ తేదీ వరకు ముంబై, బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, ఎమ్‌ఎమ్‌ఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో జరగనుంది. అయితే, ఈ ఆఫర్ ముంబైలోని వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఇందులో భాగంగా మనీకంట్రోల్, జాప్‌కీలు పాత ఇళ్లు అమ్మాలనుకునే వారికి కొంత టోకన్ అమౌంట్ ఇస్తాయి. 90 రోజుల్లోగా ఆ ఇంటిని కచ్చితంగా అమ్మిపెడతాయి. ఆసక్తి గల అమ్మకం దారులు ఈ ఎగ్జిబిషన్‌లో పార్టిసిపేట్ చేసి కొత్త ఇంటిని కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్‌పై జాప్‌కీ కో పౌండర్ సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మేము టోకెన్ డబ్బులు ఇచ్చి ఇంటిని మార్కెట్ ధరకే అమ్మి పెడతాము. అది కూడా 90 రోజుల్లోనే అమ్మి పెడతాము. అలా అమ్మలేకపోతే ఆ ఇంటిని మేమే కొనడం లేదా.. టోకెన్ అమౌంట్‌ను వదులుకుంటాం. కోటి రూపాయల పైన విలువ గల ఇంటికి లక్ష రూపాయలు.. కోటి దిగువన విలువ గల ఇంటికి 50వేల రూపాయలు టోకెన్ డబ్బులు ఇస్తాం’’ అని తెలిపారు.