క్రెడిట్ కార్డు.. ప్రస్తుత రోజుల్లో బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డులేని వాళ్లు బహుశా చాలా తక్కువ మందే ఉండొచ్చు. ఎందుకంటే బ్యాంకులు సైతం ఇప్పుడు పోటీలు పడి మరీ ఖాతాదారులకు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నాయి. ఒకప్పుడు క్రెడిట్ కార్డు పొందడం అంటే అదొక ప్రహసనం. ఇప్పుడు మాత్రం ఒక్క మెసేజ్, ఒక ఫోన్‌కాల్‌తో క్రెడిట్ కార్డు పొందచ్చు. ప్రక్రియ సులువు కావడంతో కార్డులు పొందే వారి సంఖ్య కూడా పెరిగింది. కొన్ని బ్యాంకులు అయితే లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు కూడా ఇస్తున్నాయి. ఎలాంటి వార్షిక రుసుము చెల్లించకుండానే ఉచితంగా క్రెడిట్ కార్డును వినియోగుంచుకోవచ్చు. క్రెడిట్ కార్డు పొందడం వరకు బాగానే ఉంటుంది. మరి.. తర్వాత దాని బిల్లులు ఎలా చెల్లించాలి? అనే ప్రశ్న ఒకటి వస్తుంటుంది.
క్రెడిట్ కార్డుని ఆచితూచి వినియోగించాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే పరిధి దాటి వినియోగిస్తే తర్వాత బిల్లు కట్టలేక అప్పుల పాలు కావాల్సి వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లేక నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు వాడుతుంటారు. వారిలో కొద్ది మంది మాత్రం ఆ బిల్లు మొత్తాన్ని డ్యూ డేట్‌లోగా చెల్లించలేకపోతారు. అలా చేయడవం వల్ల బ్యాంకులు వేసే వడ్డీ, చక్రవడ్డీలతో బిల్లు తడిసిమోపెడు అవుతుంది. అంతేకాకుండా మీరు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేదు కాబట్టి.. మీ సిబిల్ స్కోర్ మీద కూడా ఆ ప్రభావం పడుతుంది. అది తర్వాత మీకు రుణాలు రావడంలో ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే క్రెడిట్ కార్డు బిల్లును గడువులోగా చెల్లించలేకపోతే మీరేం కంగారు పడొద్దు అంటోంది ఆర్బీఐ.
నెలవారీ ఖర్చులు, ఇంట్లోని అవసరాలు లేదా బిల్లు చెల్లించడం మర్చిపోయి ఉండచ్చు. ఇలా కారణం ఏదైనా క్రెడిట్ కార్డు బిల్లు గడువు దాటిపోతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డు వాడకం విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను కూడా తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు మంజూరు చేసే సంస్థలు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు వినియోగదారుడు బకాయి పడ్డ రోజుల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవి గనుక మూడు రోజులకు మించి ఉంటేనే క్రెడిట్ కార్డు హోల్డర్ కు పెనాల్టీ, ఛార్జెస్ లాంటివి విధించాల్సి ఉంటుంది. అంటే కార్డు హోల్డర్ డ్యూ డేట్ దాటిన మూడ్రోజుల్లోగా బిల్లు చెల్లిస్తే ఎలాంటి చర్యలు తీసుకునేందుకు వీలు లేదు. మూడ్రోజుల్లోగా అయితే ఎలాంటి ఛార్జెస్ లేకుండానే బిల్లును చెల్లించుకోవచ్చు. మూడ్రోజులు దాటితే మాత్రం సంస్థలు మీకు లేట్ ఫీజ్ కట్టాల్సి ఉంటుంది. అదికూడా మీ కార్డులో ఉన్న అవుట్ స్టాండింగ్ అమౌంట్ మీద మాత్రమే విధంచాలి గానీ.. మొత్తం బాకీ మీద వేసేందుకు వీలు లేదని ఆర్బీఐ కొత్త నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి.