లోన్ కట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు లోన్ కట్టమని రికవరీ ఏజెంట్లు వేధిస్తున్నారా? సమయం కాని సమయంలో మీ ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారా? వాట్సాప్ లో మెసేజులు పెట్టి ఒత్తిడికి గురి చేస్తున్నారా? చెప్పుకోలేని విధంగా మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారా? అయితే ఇలా చేస్తే వాళ్ళు మళ్ళీ మీ జోలికి రారు.
లోన్ రికవరీ ఏజెంట్లు పెట్టే వేధింపులను భరించలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వడ్డీకి కూడా వడ్డీ కట్టమని వేధించి ముప్పుతిప్పలు పెట్టిన సంఘటనలు గతంలో చూశాం. లోన్ తీసుకున్న వారి నుంచి ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలని బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు రికవరీ ఏజెంట్ల మీద ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారు హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, అశ్లీల వెబ్ సైట్స్ లో పెడతామని బెదిరించే స్థాయికి దిగజారి ప్రవర్తిస్తున్నారు. ఈ ఒత్తిడి భరించలేక, బాధలు పడలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇలాంటి వారిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
రికవరీ ఏజెంట్లు లోన్ తీసుకున్న వారిని ఒత్తిడికి గురి చేయడం, దుర్భాషలాడటం, శారీరకంగా గాయపరచడం వంటి వేధింపులకు గురి చేయడం నేరమని ఆర్బీఐ స్పష్టం చేసింది. రుణగ్రహీతలు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడకూడదని, లోన్ తీసుకున్న వారికి ఫోన్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు సందేశాలు పంపించకూడదని పేర్కొంది. ముఖ్యంగా లోన్ తీసుకున్నవారిని బెదిరించడం, ఉదయం 8 గంటల లోపు, రాత్రి 7 గంటల తర్వాత రుణగ్రహీతల ఇళ్లకు వెళ్లకూడదని తెలిపింది. ఆర్బీఐ ఇంత స్పష్టంగా చెప్పినా కూడా రికవరీ ఏజెంట్లు ఇంకా అలానే ప్రవర్తిస్తున్నారు. ఒకవేళ మీరు లోన్ తీసుకుని కట్టలేని పరిస్థితుల్లో రికవరీ ఏజెంట్లు మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే కనుక వారిపై చర్యలు ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకోండి.
రికవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడుతుంటే.. వారి కాల్ డేటా, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్, చాట్ మెసేజులు భద్రపరచుకోవాలి. వీటి సాయంతో మిమ్మల్ని వేధిస్తున్న రికవరీ ఏజెంట్ల మీద ఫిర్యాదు చేయవచ్చు. రికవరీ ఏజెంట్ల వేధింపుల నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోతే కోర్టు ద్వారా ఉపశమనం పొందవచ్చు. మిమ్మల్ని వేధింపులకు గురి చేసినందుకు పరిహారం కూడా పొందవచ్చు. లోన్ ఆఫీసర్ లేదా బ్యాంకు వారిని సంప్రదించి రికవరీ ఏజెంట్ల వేధింపులను నిలువరించమని చెప్పవచ్చు. అయినప్పటికీ రికవరీ ఏజెంట్లు వేధింపులు ఆపకపోతే ఆర్బీఐకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. రుణగ్రహీతలకు ఎదురైనా పరిస్థితులను, ఫిర్యాదులను ఈమెయిల్ లో పేర్కొనాలి.
అలా చేస్తే నిబంధనల ఉల్లంఘన కింద మీ ప్రాంతంలో ఉన్న రికవరీ ఏజెంట్లను ఆర్బీఐ నిషేధించే అవకాశం ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నట్లు తేలితే ఈ నిషేధాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి గానీ, మీ ఆఫీసుకు గానీ వచ్చి స్నేహితులు, తోటి ఉద్యోగుల మధ్య మిమ్మల్ని కించపరిచేలా, అవమానపరిచేలా మాట్లాడినా, దూషించినా, మీ గౌరవానికి భంగం కలిగించినా మీరు బ్యాంకు వారిపై, రికవరీ ఏజెంట్లపై పరువు నష్టం దావా వేయవచ్చు. మరి ఈ విషయాన్ని మీ బంధు, మిత్రులకు షేర్ చేయండి. లోన్ కట్టలేని పరిస్థితుల్లో ఒక మనిషిని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న లోన్ రికవరీ ఏజెంట్లపై మీ అభిప్రాయమేమిటి? మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఎదురైందా?