Coffee Day: ప్రముఖ కాఫీ ఉత్పత్తుల వ్యాపార సంస్థ ‘‘కాఫీ డే’’ మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ సంస్థ అప్పుల చెల్లింపులో విఫలమైంది. వడ్డీలతో పాటు బ్యాంకులకు, ఆర్థిక రంగ సంస్థలకు, అన్‌లిస్టెడ్ డెట్ సెక్కూరిటీస్‌కు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయింది. సెప్టెంబర్ 30, 2022 నాటికి కాఫీ డే చెల్లించాల్సిన మొత్తం 465.66 కోట్ల రూపాయలుగా ఉండింది. ఈ మొత్తాన్ని కాఫీడే చెల్లించలేకపోయింది. లిక్విడిటీ సంక్షోభం కారణంగానే అప్పుల చెల్లింపులో జాప్యం జరిగిందని కాఫీ డే తెలిపింది. కాగా, అప్పుల బాధతో కాఫీ డే ఛైర్మన్ వీజీ సిద్ధార్థ 2019, జులైలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుల కారణంగా ఆయన మంగళూరులోని నేత్రావతి నదిలో దూకారు.
36 గంటల తర్వాత ఆయన శవం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. సిద్ధార్థ మరణించిన నాటికి మొత్తం 7000 కోట్ల రూపాయల అప్పు ఉండింది. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నా కూడా కాఫీ డేను నిలబెట్టడానికి ఆలోచన చేశారు సిద్ధార్థ భార్య మాళవిక హెగ్డే. వేల కోట్ల రూపాయల అప్పులకు భయపడకుండా.. కాఫీ డే సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఎంతో శ్రమకు ఓడ్చి అప్పుల చెల్లింపుల కోసం వ్యూహ రచన చేశారు. వ్యూహ రచనలో విజయం సాధించారు. మొత్తం అప్పుల్ని 3100 కోట్ల రూపాయలకు తీసువచ్చారు. అందులో అప్పులు ఇచ్చిన వారికి ఎలాంటి నష్టాల్ని కలుగజేయలేదు. వారికి ఇవ్వాల్సిన దానిలో ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్టలేదు.