మీరు స్వయంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి అని అనుకుంటున్నారా? అయితే స్టాండప్ ఇండియా పథకంలో దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి రూపాయల వరకూ ఋణం పొందవచ్చు. దాని కోసం ఏం చేయాలంటే?
ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, ఎవరికి వారు స్వీయశక్తితో ఎదిగేందుకు ప్రభుత్వాలు ఆయా పథకాలను అమలు చేస్తుంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే స్టాండప్ ఇండియా పథకం. ఈ పథకం 2016 ఏప్రిల్ 5న ప్రారంభించబడింది. కింద స్థాయి నుంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేసేందుకు ప్రభుత్వం 40 వేల 700 కోట్ల రూపాయలను 1.80 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి, మహిళలకు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా అన్ని బ్యాంకు శాఖల్లో ఈ పథకం కింద రుణాలను అందించడమే లక్ష్యంగా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. ఈ లబ్దిదారులంతా ఏడేళ్ల క్రితం ఈ పథకంలో చేరారు. ఈ పథకం యొక్క కాలపరిమితి ఏడేళ్లు. ఏడేళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున జమ చేసింది.
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. ‘1.80 లక్షలకు పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వారు, మహిళలు రూ. 40,600 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసినందుకు తృప్తిగా ఉందని, గర్వించతగ్గ విషయమని అన్నారు. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలకు ప్రోత్సాహాన్ని నిరంతరం అందించేందుకు ఈ పథకం బాగా సహకరిస్తుందని.. ఎదగాలన్న కోరిక బలంగా ఉన్న వారికి అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకు బ్రాంచుల నుంచి రుణాలు తీసుకునే వాతావరణాన్ని కల్పిస్తుందని అన్నారు. అయితే ఈ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ కల్పన, సాధికారత వంటి అంశాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 వరకూ పొడిగించింది. ఈ పథకం ద్వారా మహిళలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారు రూ. 10 లక్షల నుంచి రూ. కోటి వరకూ రుణాలు పొందవచ్చు. కాబట్టి మీరు కూడా ఈ పథకంలో చేరవచ్చు.