ఏపీ వర్సెస్ తెలంగాణ.. ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ల్యాండ్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఎక్కడ కొంటే ఎక్కువ లాభం వస్తుంది.
ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడొక హాట్ టాపిక్ నడుస్తోంది. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనవచ్చునని ఓ సందర్భంలో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 300 ఎకరాలు కొనవచ్చునని కామెంట్స్ చేశారు. దీంతో రాజకీయంగా చర్చ నడుస్తోంది. ఏపీలో ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉన్నాయా? తెలంగాణలో ఎక్కువ ఉన్నాయా? అసలు ఎక్కడ ల్యాండ్ కొంటే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది? అన్న సందేహాలు మొదలయ్యాయి జనాలకి. ఈ క్రమంలో అసలు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఎక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి? ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్ అనగానే మొదటగా గుర్తొచ్చేది హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీహిల్స్ వంటి ఏరియాలు. జూబ్లీహిల్స్ లో స్థలం కొనాలంటే చదరపు అడుగు రూ. 30 వేల నుంచి రూ. 35 వేల మధ్యలో ఉంది. అంటే గజం స్థలం కొనాలంటే రూ. 3 లక్షలు పైమాటే. 150 గజాలు కొనాలంటే దగ్గర దగ్గర రూ. 5 కోట్లు అవుతుంది. జూబ్లీహిల్స్ లో ఎకరం స్థలం విలువ రూ. 130 కోట్లు పైమాటే. హైటెక్ సిటీలో గజం రూ. 2 లక్షల పై నుంచి 3 లక్షలు ఉంది. ఇక్కడ ఎకరం కొనాలంటే కొనలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టడం అసాధ్యం. మిగతా ఏరియాల్లో అంటే కూకట్ పల్లి, మియాపూర్ వంటి ఏరియాల్లో చదరపు అడుగు రూ. 5 వేలు ఉంది. గజం రూ. 45 వేల నుంచి రూ. 50 వేల మధ్యలో ఉంది. 150 గజాల స్థలం కొనాలంటే రూ. 67 లక్షల నుంచి రూ. 75 లక్షలు అవుతుంది.
ఇప్పుడు ఏపీలోని వైజాగ్ చూసుకుంటే పోతినమల్లయ్య పాలెం, శ్రీనివాస నగర్, మధురవాడ, ఆనందపురం, భోగాపురం వంటి ఏరియాల్లో హైదరాబాద్ లో ఉన్న రేట్లే ఉన్నాయి. పోతినమల్లయ్య పాలెంలో గజం స్థలం రూ. 68 వేలు వరకూ ఉంది. కూకట్ పల్లి, మియాపూర్ లో ఉన్న కొన్ని స్థలాల రేట్ల కంటే ఎక్కువే. శ్రీనివాస నగర్ లో గజం రూ. 60 వేలు ఉంది. మధురవాడలో గజం రూ. 59,000 ఉంది. ఇక హైదరాబాద్ తో పోల్చతగ్గ రాజధాని అమరావతి. అమరావతి గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఉంది. మంగళగిరి, బ్రాడీపేట, నల్లపాడు, చుట్టుగుంట, శ్యామలా నగర్, విజయవాడ అమరావతి కారిడార్ లో కంకిపాడు, పెనమలూరు, పోరంకి, ఏడుపుగల్లు.. విజయవాడ ఎయిర్ పోర్ట్ కారిడార్ లో గన్నవరం, కేసరపల్లి వంటి ప్రాంతాలు అమరావతి పరిధిలోకి వస్తాయి. బ్రాడీపేటలో గజం రూ. 58 వేలు, చుట్టుగుంటలో రూ. 20 వేలు, మంగళగిరిలో రూ. 18 వేలు ఉన్నాయి. బ్రాడీపేటలో గజం రూ. 58 వేలు అంటే కూకట్ పల్లి లో కొన్ని చోట్ల ఉన్న ల్యాండ్ రేట్ల కంటే ఎక్కువే.
ఇక కర్నూలు చూసుకుంటే కర్నూలు సిటీలో గజం స్థలం గరిష్టంగా రూ. 15 వేల వరకూ ఉన్నాయి. నంద్యాలలో గజం రూ. 10 వేలు, బి తాండ్రపాడులో రూ. 13,500, పంచలింగాలలో రూ. 13 వేలు ఉన్నాయి. ఇవీ రాజధాని హైదరాబాద్ లోనూ, అలానే రాజధానులుగా పిలవబడుతున్న వైజాగ్, అమరావతి, కర్నూలులో ల్యాండ్ రేట్లు. ప్రస్తుతానికి హైదరాబాద్ కి పోటీ ఇస్తున్న నగరం అంటే అది విశాఖపట్నమే. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు రావాలి అని అనుకునేవారు హైదరాబాద్ లో కంటే వైజాగ్ లో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఎందుకంటే హైదరాబాద్ దాదాపు డెవలప్ అయ్యింది. ఇక ల్యాండ్ రేట్లు మరీ ఎక్కువగా ఐతే పెరిగే అవకాశం లేదు. ఎంతవరకూ రీచ్ అవ్వాలో అంతవరకూ రియల్ ఎస్టేట్ రీచ్ అయిపోయింది. హైదరాబాద్ లాంటి నగరం ఏపీలో వైజాగ్ అవుతుంది. ఇంకా వైజాగ్ కి బోలెడంత భవిష్యత్తు ఉంది. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్ చేస్తే నివాసానికి అయినా, వ్యాపారానికి అయినా లాభసాటిగా ఉంటుంది.
ఉదాహరణకు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గజం రూ. 50 వేలు చొప్పున కొన్నారనుకోండి.. ఏడాదిలో దాని విలువ పెద్దగా ఏమీ మారిపోదు. అదే వైజాగ్ లో అయితే రాజధానిగా డెవలప్ అయ్యే స్కోప్ ఉంది కాబట్టి భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి అనుకుంటే కనుక అమరావతి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. బ్రాడీపేట మినహాయిస్తే ఇక్కడ ల్యాండ్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అమరావతిని స్మార్ట్ సిటీగా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. స్మార్ట్ సిటీగా ఏర్పాటైతే అక్కడ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇక కర్నూలు కూడా అభివృద్ధి చెందుతుంది.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ప్రధాన నగరాల్లో వరంగల్, నిజామాబాద్, ఖమ్మం ఏరియాలు ఉన్నాయి. ఏపీలో వైజాగ్ తర్వాత ప్రధాన నగరాల్లో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కాకినాడ వంటి నగరాలు ఉన్నాయి. వరంగల్ లోని హన్మకొండలో గజం రూ. 50 వేల వరకూ ఉంది. నిజామాబాద్ లో గజం గరిష్టంగా రూ. 90 వేలు పలుకుతోంది. ఖమ్మంలో కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి. ఖమ్మం సిటీలో గజం రూ. 70 వేల దాకా ఉంది. ఇక ఏపీ విషయానికొస్తే విజయవాడలోని భవానీపురంలో గరిష్టంగా గజం రూ. 77 వేలు ఉంది. గుంటూరులోని బ్రాడీపేటలో రూ. 58 వేలు ఉంది. నెల్లూరులోని తడలో గజం గరిష్టంగా రూ. 27 వేలు నుంచి రూ. 30 వేలు మధ్యలో ఉంది. కాకినాడలో గజం గరిష్టంగా రూ. 62,550 వరకూ ఉంది. ఈ సిటీల్లో ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటే కనుక పెట్టుబడి కోసమే అయితే ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోని అర్బన్ ఏరియాల్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే ఏపీలోని సిటీల్లో పెట్టుబడి పెట్టడం వల్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక స్మార్ట్ సిటీ లిస్టులో అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలూ ఉన్నాయి కాబట్టి మరింత డెవలప్ అయితే స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్ అనే గ్రామంలో గజం రూ. 4500 నుంచి రూ. 18 వేల రేంజ్ లో ఉంది. శంకరపల్లిలో గజం రూ. 16 వేల నుంచి రూ. 30 వేల మధ్యలో ఉంది. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంఘం ఏరియాలో గజం రూ. 3,500 నుంచి రూ. 15 వేల మధ్యలో ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిమ్జ్ ని ప్రకటించింది కాబట్టి ఇక్కడ ల్యాండ్ రేట్లు పెరిగాయి. ఇక మెదక్ జిల్లాలోని పటాన్ చెరువు ప్రాంతంలో అయితే గజం రూ. 28 వేలు అవుతుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లిలో అయితే గజం రూ. 26 వేలు ఉంది. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాల్లో ఎకరం రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలు పలుకుతోంది. స్థలాల పరంగా అయితే గజం రూ. 2 వేలు నుంచి రూ. 4 వేలు పలుకుతోంది. సెంటు లెక్కన అయితే రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలు పలుకుతోంది. గ్రామాల్లో లక్ష పెట్టి సెంటు స్థలం కొంటే ఏడాదిలో డబుల్ అయ్యే గ్రామాలు కూడా ఉన్నాయి.
తెలంగాణలో కూడా ఎకరం రూ. 15 లక్షలు, రూ. 20 లక్షలు ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. ఇవి పెట్టుబడికి అనుకూలమైన ప్రాంతాలు అని చెప్పలేము. కానీ తెలంగాణలోని రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో మంచి లాభాలు ఉంటాయి. ఏపీలో మాత్రం తెలంగాణలోని గ్రామాల్లో ఉన్నంత లాభం ఉండదు. కానీ అక్కడ ల్యాండ్ ధరలు తెలంగాణలోని కొన్ని గ్రామాలతో పోలిస్తే తక్కువే. అయితే అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వేగంగానే అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 100 ఎకరాలు కొనగలిగే భూములు ఉన్నాయి, అలానే తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు కొనగలిగే భూములు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రానికైనా పల్లెలే పట్టుకొమ్మలు.
తెలంగాణలో సంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి జిల్లాలు, జీవో 111 పరిధిలో ఉన్న గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇక ఏపీలో విజయనగరం జిల్లా భోగాపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఓడరేవు ప్రస్తుతం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇక స్మార్ట్ సిటీలుగా అమరావతి, కాకినాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలు తయారవుతున్నాయి. వీటిలో ఎక్కడ పెట్టుబడి పెట్టినా లాభసాటిగానే ఉంటుంది. అయితే ఏపీ, తెలంగాణలో మీకు అనుకూలంగా ఉన్నాయో, లేదో అనేది పెట్టుబడి పెట్టే ముందు ఆలోచించుకోవాలి.
గమనిక: ఈ రేట్లు అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. మీరు తీసుకునే నిర్ణయానికి, సుమన్ టీవీ బాధ్యత వహించదు.