అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సంపదలోంచి పెద్ద మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని వెల్లడించారు. అయితే, ఈ మొత్తాన్ని ఆయన ఎప్పుడు? ఎలా? ఎవరికి ఇస్తారనేది మాత్రం స్పష్టం చేయలేదు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ తరహాలో సంపదను దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించండంలో బెజోస్ పాల్గొనడం లేదంటూ గతంలో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బెజోస్ ఈ ప్రకటన చేశారు.
ప్రస్తుతం బెజోస్ సంపద 124 బిలియన్ డాలర్లు అంటే.. భారత కరెన్సీలో సుమారు రూ.10 లక్షల కోట్ల పైమాటే. ఇందులోంచి ఆయన పెద్ద మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఎంత మొత్తం అన్నది వెల్లడించలేదు. తన స్నేహితురాలు లారెన్ శాన్ వెజ్ తో కలిసి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెజోస్ ఈ విషయాన్ని వెల్లడించారు. “ఈ ప్రక్రియలో సంపదను ఎలా ఖర్చు చేయాలనేదే నాముందున్న అత్యంత కష్టమైన పని. అమెజాన్ నిర్మాణం సులువుగా జరగలేదు. దాని వెనుక ఎందరో కృషి ఉంది. లారెన్, నేను కలిసి ఈ సంపదను ఖర్చు పెట్టేందుకు సరైన మార్గం కోసం వెతుకుతున్నాం” అని తెలిపారు.
Jeff Bezos pledges to donate majority of his $124 billion fortune to fight climate change and unify humanity. pic.twitter.com/4QwpN5sgia
— Pop Base (@PopBase) November 14, 2022
అయితే ఇదే సమయంలో బెజోస్ మరి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఖరీదైన వస్తువులు కొనొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, రానున్న సంక్షోభం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాయని, రాబోవు రోజుల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని అధిగమించాలంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గతేడాది బెజోస్ అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.