బంగారం మీద 5 రకాలుగా పెట్టుబడి పెట్టవచ్చు. అలానే లాభం కూడా పొందవచ్చు. వడ్డీ కూడా వస్తుంది. రిస్క్ అనేది తక్కువ.
బంగారం అనేది ఎప్పుడూ డిమాండ్ ఉండే సరుకే. ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. కానీ పెరుగుదల అనేది భారీగా ఉంటుంది. ఉదాహరణకు నిన్నటి ధర మీద 10 శాతం తగ్గిందనుకుంటే ఇవాళ 20 శాతం పెరుగుతుంది. అంటే 10 శాతం అనేది బంగారం పెరుగుదలలో కనిపిస్తుంది. బంగారం తగ్గితే తక్కువ తగ్గుతుంది, పెరిగితే భారీగా పెరుగుతుంది. ఇది ఒకే రోజులో జరగొచ్చు, కొన్ని రోజుల పాటు జరగవచ్చు. కానీ బంగారం ధరలో మాత్రం పెరుగుదల మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అయితే బంగారు ఆభరణాలు కొన్నప్పుడు తరుగు, తయారీ ఛార్జీలు అనేవి ఉంటాయి. అలంకరణ కోసం బంగారం కొనేవారికి ఈ ఛార్జీలు పెద్ద భారం అనిపించవు కానీ పెట్టుబడిగా భావించే వారికి మాత్రం నష్టమనే చెప్పాలి. భౌతిక బంగారం కంటే కూడా ఇతర గోల్డ్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. 5రకాలుగా బంగారం మీద పెట్టుబడి పెట్టవచ్చు. అయితే వీటిలో రిస్క్ ఎందులో తక్కువగా ఉంటుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకోండి.
భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లను భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేస్తుంది. ఈ పథకంలో ఒక మనిషి కనిష్టంగా 1 గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయవచ్చు. ఈ గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ పీరియడ్ 8 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ గోల్డ్ బాండ్లు కొనుక్కుని లాకర్ లో ఉంచితే ఏడాదికి 2.50 శాతం వడ్డీ వస్తుంది. మెచ్యూరిటీ సమయంలో బంగారం ధర ఎంత ఉంటే అంత ధర చెల్లించి డబ్బులు ఇస్తారు. ఇప్పుడు గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ. 5 వేలు ఉంటే.. 8 ఏళ్ల తర్వాత రూ. 10 వేలు అయిందనుకోండి.. ఆ ధర చెల్లిస్తారు. దాంతో పాటు వడ్డీ కూడా చెల్లిస్తారు. ఈ మధ్యనే సావరిన్ గోల్డ్ బాండ్లలో 8 ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టిన వాళ్ళు భారీగా లాభాలను పొందారు. ప్రభుత్వ హామీ ఉండడం వల్ల పెట్టుబడికి తగినదని చెప్పవచ్చు. అలానే రిస్క్ అనేది ఉండదు.
ఆన్ లైన్ లో బంగారం కొనుక్కోవచ్చు. ఒక రూపాయితో కూడా బంగారం కొనవచ్చు. మిల్లీ గ్రాముల్లో, గ్రాముల్లో బంగారం కొనుక్కోవచ్చు. ఏ సమయంలో అయినా అమ్ముకోవచ్చు. ఎప్పుడైనా కావాలనుకుంటే భౌతికంగా కూడా ఇస్తారు. అయితే ఈ బంగారాన్ని మీకు అమ్మిన వారే వారి దగ్గర ఉంచుకుంటారు. సురక్షితమైన ప్రదేశంలో భద్రపరచబడుతుంది. అలానే పూర్తిగా బీమా సౌకర్యం ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలతో డిజిటల్ గోల్డ్ ధరలు అనేవి అనుసంధానమై ఉంటాయి. కాబట్టి మీరు మార్కెట్లో బంగారం పెరిగితే డిజిటల్ గోల్డ్ ధరలు పెరుగుతాయి. తగ్గితే తగ్గుతాయి కూడా. ఫోన్ పే, పేటీఎం వంటి సంస్థలు డిజిటల్ గోల్డ్ ని అమ్ముతున్నాయి. బంగారం మీద డిస్కౌంట్ కూడా ఇస్తున్నాయి. ఈ డిజిటల్ గోల్డ్ అనేది స్వచ్ఛత విషయంలో సర్టిఫికెట్ కలిగి ఉంటాయి.
గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. బంగారం కొనడానికి ఉన్న మరొక ఆప్షన్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ లు. ఇది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం లాంటిదే. ఈ గోల్డ్ ఈటీఎఫ్ లు దేశీయ మార్కెట్లో ఉన్న భౌతిక బంగారం ధరలతో ముడిపడి ఉంటాయి. స్టాక్ ఎక్స్ఛేంజెస్ లో గోల్డ్ ఈటీఎఫ్ లనేవి లిస్టింగ్ లో ఉంటాయి. మీరు పెట్టే పెట్టుబడితో ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీలు బులియన్ బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. స్టాక్ మార్కెట్ ఓపెన్ లో ఉన్న సమయంలో ఎప్పుడైనా ఈ గోల్డ్ ఈటీఎఫ్ లను కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్ ఈటీఎఫ్ లు అనేవి చాలా సురక్షితం, భద్రం. చాలా టైట్ సెక్యూరిటీ మధ్య ఈ వ్యవహారం నడుస్తుంది.
కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టడంలో రిస్క్ అనేది ఉండదు. స్టాక్ ఎక్స్ఛేంజ్ లో గోల్డ్ ఈటీఎఫ్ లు కొన్న రోజునే అమ్ముకోవచ్చు లేదా వేరే ఏ రోజైనా అమ్ముకోవచ్చు. కనీస పెట్టుబడి కింద భౌతిక బంగారం బయట మార్కెట్లో ఎంత ఉంటే అంత పెట్టుబడి పెట్టుకోవచ్చు. గ్రాము నుంచి ఎన్ని గ్రాములైనా కొనవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్ట్ చేయబడి ఉన్న కారణంగా లిక్విడిటీ అనేది అధికంగా ఉంటుంది. అలానే స్టాక్ మార్కెట్లో క్రయవిక్రయాలు సులభంగా చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ ఒక్కో యూనిట్ 99 శాతం లేదా అంతకంటే ఎక్కువ శాతం స్వచ్ఛతతో ఉన్న బంగారం ధరకు మద్దతిస్తుంది. బంగారం డీమ్యాట్ రూపంలో ఉంటుంది కాబట్టి భద్రత గురించి ఆందోళన ఉండదు.
గోల్డ్ ఈటీఎఫ్ లు అందించబడిన గోల్డ్ యూనిట్లలో గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి పెట్టుబడులు పెడతాయి. డీమ్యాట్ ఖాతా లేని వారు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఈటీఎఫ్ లలో పెట్టుబడులు పెట్టడానికి వీలుంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఎక్కువ మంది ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ నే సూచిస్తారు. బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ అవకాశం కల్పిస్తున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి పలు బ్యాంకులు, నిప్పన్ ఇండియా గోల్డ్ సేవింగ్స్ ఫండ్, క్వాంటమ్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్ పేరుతో కొన్ని ఇతర ఆర్థిక సంస్థలు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తున్నాయి.
బంగారం తక్కువ ఉన్నప్పుడు కొనడం.. ధర పెరిగినప్పుడు అమ్మేయడం ద్వారా లాభం పొందవచ్చు. అయితే అమ్మడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. అలంకరణ కోసం, అందం కోసం ఉంచుకుంటారు. కాబట్టి ఇది పెట్టుబడి లెక్కలోకి రాదు. పైగా తయారీ ఛార్జీలు, తరుగు అనేది ఉంటుంది. బంగారం ఇంట్లో ఉండడం వల్ల రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. పోనీ లాకర్ లో పెడదామన్నా కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. డిజిటల్ గోల్డ్, గోల్డ్ బాండ్లు వంటివి డబ్బు తీసుకోకుండా కొన్న బంగారాన్ని భద్రంగా దాచి పెడుతున్నాయి. బంగారం పెరిగితే లాభం వస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్లు కొంటే వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి భౌతిక బంగారం కంటే ఈ నాలుగు గోల్డ్ పెట్టుబడులు మంచి మార్గమని, రిస్క్ తక్కువ అని నిపుణులు సూచిస్తున్నారు.