‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 6’ అంగరంగ వైభవంగా ఈ బుల్లితెర రియాలిటీ షో ప్రారంభమైంది. ఈసారి హౌస్‌లో 21 మంది సభ్యులు ఉండటం అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతమందిని ఒకేసారి హౌస్‌లోకి పంపడం వెనుకున్న బిగ్ బాస్ ప్లాన్ ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అయితే హౌస్‌లో గలాటా షురూ అయిపోయింది. ఇప్పుడిప్పుడే సభ్యులంతా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఫస్ట్ నామినేషన్ వస్తేగానీ అసలు విషయాలు, వాళ్ల మనసులోని మాటలు బయటకు రావనమాట. అన్ని సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ కచ్చితంగా భిన్నంగా ఉండేలా ఉంది. అందుకు తగిన సకల ఏర్పాట్లు బిగ్ బాస్ నిర్వాహకులు చేసినట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న వారిలో తెలుగు ప్రేక్షకులకు పింకీ బాగా తెలుసు. చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె.. నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ ఆమెను పింకీ అనే పిలుస్తున్నారు. తన అసలు పేరు సుదీపా అంటూ చెప్పుకొచ్చింది. తల్లిదండ్రులు క్లాసికల్ డాన్సర్లు కావడంతో వారి వద్దే నాలుగేళ్ల వయసు నుంచే కూచిపూడి నేర్చుకుంది. నాగార్జున కోరిక మేరకు స్టేజ్ పైనే వివిధ సందర్భాలను ఎక్స్ ప్రెషన్స్ రూపంలో చూపించి ఎంతో ఆకట్టుకుంది. ఇంత ఎదిగినా.. తనని ఇప్పటికీ అంతా పింకీలాగానే చూస్తున్నారంటూ గుర్తుచేసుకుంది. తనకి పింకీ పాత్ర ఎంతో ఇష్టమని కానీ, సుదీపగానే తనని గుర్తించాలని కోరుకుంది.
ఎందుకంటే పింకీ అమాయకురాలు, కానీ.. సుదీప మాత్రం తెలివైనది, సమయస్ఫూర్తి కలది. అందుకే తనకు సుదీప అనే గుర్తింపు రావాలని కోరుకుంటోంది. అంతేకాకుండా తన లైఫ్‌లో జరిగిన కొన్ని అద్భుతాల్లో పెళ్లి కూడా ఒకటి. అవును ఆమె పెళ్లి అంత ఈజీగా జరగలేదంట. ఆమె ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడి ఆనందంగా గడుపుతోంది. అయితే ఆ పెళ్లి కోసం దాదాపు నాలుగేళ్లు తాను పోరాడాల్సి వచ్చింది. శ్రీరంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో సుదీప ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆ విషయం ఇంట్లో చెప్పి, వాళ్లని ఒప్పించి పెళ్లి చేసుకునేందుకు నాలుగేళ్ల సమయం పట్టింది. పెళ్లి తర్వాత పింకీ సినిమాలకు దూరమైంది. సీరియల్స్ రూపంలో మాత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. మరి.. బిగ్ బాస్ లో పింకీ రాణించగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.