బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఆఖరి వారాల్లో ఎంతో ఎమోషనల్‌గా మారుతోంది. ఇప్పటివరకు ఉన్న టాక్ మొత్తం ఫ్యామిలీ ఎపిసోడ్‌తో తలకిందులు అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇంకో ఫ్యామిలీ మూమెంట్ బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతో ఎమోషనల్ చేస్తోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలోనే జరగని ఒక ఘటన తెలుగు బిగ్ బాస్ లో జరిగింది. డిసెంబర్ 1వ తారీఖున సింగర్ రేవంత్‌కు కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. రేవంత్ భార్య అన్విత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ద్వారా ప్రేక్షకులతో పంచుకుంది. కానీ, నేరుగా రేవంత్‌కు చెప్పే పరిస్థితి లేదు. అలాగే ఆ విషయాన్ని రేవంత్‌కి ఎలా చెప్తారు అనే విషయంపై కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా విడుదలైన ప్రోమో ఆ విషయాన్ని రివీల్ చేశారు.
గురువారం పాప పుట్టగా.. శుక్రవారం ఆ విషయం తెలిసింది. బిగ్ బాస్ కూడా శుక్రవారమే రేవంత్‌కి ఆ విషయాన్ని తెలియజేశారు. రేవంత్‌ని సీక్రెట్ రూమ్‌లోకి పిలిచి.. “ రేవంత్ మీకొక శుభవార్త. గురువారం రాత్రి 11 గంటల 51 నిమిషాలకు మీకు పాప పుట్టింది” అని వెల్లడించారు. ఆ మాట వినగానే రేవంత్ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. సీక్రెట్ రూమ్‌లోనే రేవంత్ ఏడ్చేశాడు. ఆ తర్వాత ఇంట్లోని సభ్యులకు కూడా ఆ విషయాన్ని తెలియజేశాడు. అందరూ ఆ వార్త వినగానే ఎగిరిగంతేశారు. బిగ్ బాస్ వారికోసం స్వీట్లను కూడా పంపాడు. అంతా రేవంత్‌కి శుభాకాంక్షలు చెబుతూ సంబరాలు చేసుకున్నారు.
తర్వాత శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కూడా ఆ విషయాన్ని రేవంత్‌కు తెలియజేశాడు. అయితే రేవంత్ కోసం మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇలా జరగలేదు. రేవంత్‌కు తన కుమార్తెను పరిచయం చేసేందుకు బిగ్ బాస్ ఆమెకు వీడియోకాల్ చేశారు. హౌస్‌లోని సభ్యులు మొత్తం అక్కడ ఉండగా.. అన్వితకు వీడియో కాల్ చేశారు. రేవంత్ తన కుమార్తెను చూసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యాడు. హౌస్‌మేట్స్ కూడా రేవంత్ కుమార్తెను చూస్తూ మురిసిపోయారు. రేవంత్ అయితే కుమార్తె కోసం ఒక మంచి పాట కూడా పాడి వినిపించాడు. ప్రేక్షకులు అంతా ఈ ప్రోమో చూసి ఎమోషనల్ అవుతున్నారు. ఈ సీజన్ మొత్తానికి ఇది హైలెట్ ఎపిసోడ్ అంటూ చెబుతున్నారు.