‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ వీజే సన్నీ. అందరూ అనుకున్నట్లుగానే ‘కప్పు ముఖ్యం బిగులూ’ అంటూ కప్పు కొట్టేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీజే సన్నీ గురించే ప్రస్తావన. వీజే సన్నీగా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ సన్నీగా ఎలా మారాడో తెలుసుకుందాం.
సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి.. రిపోర్టర్, వీజే, యాక్టర్ ఇలా తన కెరీర్ కు బాటలు వేసుకుంటూ బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చాడు. సన్నీకి బిగ్ బాస్ హౌస్ లోకి రావడం అనేది ఒక కల. కల కన్నట్లుగానే దానిని సాకారం చేసుకున్నాడు. వీజే సన్నీ గెలవడానికి కారణాలు ఏంటంటే.. సన్నీ మొదటి నుంచి మంచి ఎంటర్ టైనర్. ఆ ఎంటర్ టైన్మెంట్ అతని విజయంలో కీలక పాత్ర పోషించింది అనే చెప్పాలి. బుల్లితెర ప్రేక్షకులు సన్నీని ఓన్ చేసుకోవడానికి మరో కారణం అతని యాటిట్యూడ్. బయట జనాలు ఎలా ఉంటారో.. బిగ్ బాస్ హౌస్ లో సన్నీ అలాగే ఉన్నాడు. కోపం వస్తే అరుస్తాడు, ప్రేమ వస్తే కౌగిలించుకుంటాడు, టాస్కులొస్తే తన వందశాతం ఎఫర్ట్ పెడతాడు ఆ యాటిట్యూడ్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.
మరో కీలక అంశం సన్నీ ఫ్రెండ్ షిప్. బిగ్ బాస్ హౌస్ లో సన్నీకి బాగా దగ్గరైంది కాజల్- మానస్. వారిలో ముఖ్యంగా మానస్ తో సన్నీకి మంచి బాండింగ్ ఏర్పడింది. తన ఫ్రెండ్స్ కోసం సన్నీ ఏదైనా చేస్తాడు. అది ఎవిక్షన్ ఫ్రీ పాస్ అయినా చాలా సింపుల్ గా ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ షిప్ అతడిని ఎంతో అభిమానించేలా చేసింది. కత్తిపోట్లు టాస్కు నుంచి సన్నీపై ప్రేక్షకులకు అభిప్రాయం మారింది. అప్పటి వరకు అందిరిలానే సన్నీని కూడా చూశారు. కానీ, ఆ తర్వాత నుంచి ప్రేక్షకుల్లో సన్నీపై సింపథి పెరిగింది. ప్రతి విషయానికి సన్నీని అందరూ టార్గెట్ చేయడం ఇంకా బాగా ప్లస్ అయ్యింది. సన్నీ ఎంత బాగా ఆడినా అతడిని రెండుసార్లు జైలుకు పంపారంటూ ఇంకా బాగా ఓన్ చేసుకున్నారు.
సన్నీ విజయానికి కళావతి కూడా ఇంకో కారణం. ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత సన్నీ- కళావతి బాండింగ్ ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చింది. కళావతి కోసం అయినా సన్నీకి ఆ కప్ ఇచ్చేయాలి అని ఫిక్స్ అయ్యారు. మొదటి నుంచి సన్నీ ఒకేలా ఉంటూ వచ్చాడు. బిగ్ బాస్ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తిలో తన ట్రూ క్యారెక్టర్ ను బయటకు తీయడం. అది సన్నీ చేయగలిగాడు అని ప్రేక్షకులు నమ్మారు. ఒక వ్యక్తిగా సన్నీని అభిమానిస్తూ చివరకు విన్నర్ ను చేశారు. బిగ్ బాస్ విన్నర్ సన్నీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.