‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ ముగిసింది. విన్నర్ వీజే సన్నీ సహా కంటెస్టెంట్లు అందరూ తమ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగానే వీజే సన్నీ విన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత కచ్చితంగా లైఫ్ లో ఎదుగుతాడనే నమ్మకంతో ఉన్నాడు సన్నీ. కానీ, ఇప్పుడు సన్నీకి కొత్త తంటా వచ్చి పడేలా ఉంది. సన్నీ అందరివాడు అనుకుంటుంటే.. కేవలం కులపోడే అంటూ కొందరు ముద్ర వేస్తున్నారు. కేవలం వారి కులపోళ్ల ఓట్లతోనే సన్నీ గెలిచినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇన్నాళ్లు లేనిది సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డిని తెర మీదకు తెస్తున్నారు.
అంతేకాదు సన్నీ కులం ఏంటి అని కూడా కొందరు గూగుల్ లో వెతుకులాట మొదలు పెట్టారు. ఊరు, విద్య, కుటుంబ నేపథ్యం గురించి వెతకడం సహజం. ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న ఇలాంటి తరుణంలో ఇలా కులం గురించి వెతుకులాట సన్నీకి కొంత ఇబ్బంది కలిగించే అంశమే. ఇలాంటి వాళ్లు చేసే వ్యాఖ్యలు, పెట్టే పోస్టులను న్యూట్రల్ గా ఉండే అభిమానులను దగ్గరకు రానివ్వకుండా చేస్తాయి. ఎంతో తెలుగు ప్రేక్షకులు ఓట్లు వేసి సన్నీని గెలిపిస్తే కేవలం ఒకే కులం వాళ్లు ఓట్లు వేసి గెలిపించారని ప్రచారం చేయడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
ఏ ఆటలో పతకం వచ్చినా, ఏ వ్యక్తి కాస్త పేరు సంపాదించినా మొదటి వెతికే ప్రశ్న కులం గురించే అన్నట్లుగా ఉంది. ఇంతకాలం అరుణ్ రెడ్డి పేరు ఏమైంది? ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చిందని ప్రశ్నిస్తున్న వారు కూడా లేకపోలేదు. వీజే సన్నీ విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.