తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తెలంగాణ హై కోర్టును కోరిన విషయం తెలిసిందే. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై భోజన విరామం తర్వాత హై కోర్టులో వాదనలు జరిగాయి. హైకోర్టులో విచారణ ప్రారంభం కాగా వాడివేడిగా ఇరు వర్గాల లాయర్లు తమ వాదనలను వినిపించారు.
ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో సునితారెడ్డి, అవినాష్ రెడ్డి తరుపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ సందర్బంగా అవినాష్ రెడ్డి లాయర్ వాదిస్తూ.. ఈ కేసులో అసలు హంతకులైన ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిలను వదిలిపెట్టి.. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిల వెంటపడుతున్నారని లాయర్ చెప్పుకొచ్చారు. రాజకీయ కారణాలతో అవినాష్ రెడిని ఇరికిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో సునితా రెడ్డి, అవినాష్ రెడ్డి లాయర్ల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మూడేళ్ల తర్వాత దస్తగిరి స్టేట్ మెంట్ పట్టుకొని సునితా రెడ్డి లాయర్ సమర్ధించి అవినాష్ రెడ్డిని వేధించడం ఏంటని ప్రశ్నించిన లాయర్. మరోవైపు దస్తగిరి స్టేట్ మెంట్ ని సమర్ధించారని అనడం అర్ధరహితం అని సునిత లాయర్ అన్నారు. ఈ సందర్భంగా అసలు వివేక హత్యకు కారణాలు ఏంటని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి లాయర్ సమాధానం ఇస్తూ.. వివేకా రెండో భార్యతో సునితకు గొడవ, వ్యాపారలావాదేవీల్లో గంగిరెడ్డితో విబేధం, సునీల్ యాదవ్ కుటుంబంతో గొడవలు, రాజకీయ కారణాలు అయి ఉంటాయని కోర్టుకు తెలిపారు.
ఇక సునిత తరుపు లాయర్ వాదన వినిస్తూ.. వివేక హత్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి.. శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఇంటికి వెళ్లారని.. వివేక చనిపోయింది గుండెపోటుతో అని నమ్మేవిధంగా చిత్రీకరించారని కోర్టుకు తెలిపారు. ఎప్పుడు నోటీస్ ఇచ్చినా.. అరెస్ట్ చేయొద్దని కోర్టుకు వెళ్తున్నారని.. ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ విచారణ జరుగుతున్న సమయంలో అవినాష్ రెడ్డి ప్రభావితం చేయడానికి చాలా సార్లు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ కేసు బదిలీ కావడానికి అవినాశ్‌రెడ్డి ముఖ్య కారణం అని సునీత తరపు న్యాయవాది హైకోర్టుకు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు అవినాష్ ని సీబీఐ విచారించాల్సి ఉండగా.. విచారణ బుధవారం నిర్వహిస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిన అరెస్టు చేసిన విషయం తెలిసిందే.